శనివారం, అక్టోబర్ 24, 2020

Published : 09/05/2019 16:13 IST
విహారయాత్రలో...బీమా తోడు?

ప్రణాళిక‌తో ప‌క్కాగా విహార యాత్ర‌ల‌కు వెళ్లేవారు కొంద‌రు... అప్పటిక‌ప్పుడు తోచిన ప్రాంతానికి ప్ర‌యాణం క‌ట్టేవారు మ‌రికొంద‌రు... ఎవ‌రైనా స‌రే.. విహార‌యాత్ర ఆనందంగా సాగిపోవ‌డ‌మే అంతిమంగా కావాల్సింది. ముఖ్యంగా విదేశీ ప్ర‌యాణాలు పెట్టుకున్న‌వారు అనుకోని కొన్ని అవాంత‌రాలూ, ఖ‌ర్చుల‌కూ సిద్ధ‌ప‌డే ఉండాలి. మ‌నం ఊహించిన విప‌త్క‌ర ప‌రిస్థితులు ఎదురైన‌పుడు ఇబ్బందులపాలుకాకుండా కాపాడేదే ప్ర‌యాణ బీమా. ఈ పాల‌సీని ఎలా తీసుకోవాలి? ప‌్ర‌యాణాల్లో ఇది ఎంత మేర‌కు ప్ర‌యోజ‌నం క‌ల్పిస్తుంద‌న్న విష‌యాల‌న్నీ తెలుసుకుందాం!

అత్యవసరంగా నగదు...

విహార యాత్ర ఆనందంగా సాగుతున్నప్పుడు దొంగతనం, దోపిడీలాంటివి జరిగి నగదు పోయిందనుకోండి. ఎంత ఇబ్బంది? ఇలాంటి పరిస్థితుల్లో అవసరమైన అన్ని ఖర్చులకూ అంటే.. భోజనం, వసతి, రవాణా, ఫోన్లు చేసుకునేందుకు ఇలా అవసరమైన నగదును వెంటనే ఇచ్చేందుకు వీలుగా ప్రయాణ బీమాలో ఏర్పాటు ఉంది.

ప్రయాణంలో అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు భారతీయ యాత్రికులకు విదేశాల్లో రెండు రకాల మార్గాలు అందుబాటులో ఉంటాయి. అత్యవసరంగా రుణం మంజూరు చేయడం లేదా ట్రావెలర్స్‌ చెక్‌ రూపంలో నగదును అందించడం. అయితే, డబ్బును పొందాలనుకున్నప్పుడు ముందుగా దొంగతనం జరిగిందని అక్కడి పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ పాలసీలో పేర్కొన్న అంశాలు, కవరేజీ ఆధారంగా మీకు అవసరమైన డబ్బు అందుతుంది. పాలసీలో పేర్కొన్న దానికి మించి డబ్బు కావాలంటే.. బీమా కంపెనీ రుణంగా అందిస్తుంది. దాన్ని స్వదేశానికి వచ్చిన తర్వాత తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

పరిహారం మొత్తం చెల్లిస్తారా?

ప్రయాణ బీమా పాలసీ తీసుకునేప్పుడు నిబంధనలు పూర్తిగా తెలుసుకోవాలి. కొన్ని పాలసీలు మీరు నష్టపోయిన మొత్తం నుంచి ముందుగా కొంత మినహాయిస్తాయి. ఇది ఎంత శాతం అనేది పాలసీ తీసుకునేప్పుడే చూసుకోవాలి. ఉదాహరణకు.. మీరు 1,000 డాలర్లకు పాలసీ తీసుకున్నారు.. అందులో మొదటి 100 డాలర్ల వరకూ పరిహారం అవసరం లేదనుకున్నారు. ఇప్పుడు మీకు 1,000 డాలర్ల నష్టం జరిగితే.. ముందుగా అనుకున్న 100 డాలర్లు తీసేసి మిగతా 900 డాలర్ల మేరకే పరిహారం లభిస్తుంది.

చాలా బీమా సంస్థలు ఇలాంటి మినహాయింపులేమీ లేకుండా పూర్తి స్థాయి పరిహారం ఇచ్చేలా పాలసీలను అందిస్తున్నాయి. అంటే మీ పాలసీ విలువ ఎంత ఉంటే అంత చెల్లిస్తారన్నమాట. ఉదాహరణకు యాత్రలో ఉండగా ఆసుపత్రిలో  చేరాల్సి వస్తే 2,000 డాలర్ల వరకూ చికిత్స ఖర్చుకు చెల్లించాలని పాలసీ తీసుకున్నారు.. ఇలాంటి సందర్భాల్లో పరిహారం క్లెయిం చేయాల్సి వచ్చినప్పుడు బీమా సంస్థ 2000 డాలర్ల వరకూ ఎలాంటి మినహాయింపులూ లేకుండా చెల్లిస్తుంది.

పాలసీ తీసుకునేప్పుడు పరిహారం మొత్తంలో కొంత మినహాయిస్తారా? లేక పూర్తిగా చెల్లిస్తారా? అనే నిబంధనల గురించి స్పష్టంగా తెలుసుకోవాలి. పూర్తి పరిహారం చెల్లించే పాలసీని ఎంచుకోవడమే ఎప్పుడూ ఉత్తమం.

విమానం వెళ్లిపోతే..

నుకున్న సమయానికి, అనుకున్నట్లుగా అన్నీ జరగడం ఎప్పుడూ సాధ్యం కాదు. ఆలస్యం కాకుండా చూసుకోవడం మన చేతిలో ఉండేదీ కాదు.. అనుకోని సంఘటనల వల్ల మనం ఎక్కాల్సిన విమానాన్ని సమయానికి అందుకోలేకపోవచ్చు. ఇలాంటప్పుడు మొత్తం ప్రయాణం అంతా మారిపోతుంది. ఖర్చుల మాట సరేసరి. ఇలాంటప్పుడు ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ను ఇచ్చిన సంస్థలు ఆ నష్టాన్ని భరించేందుకు ముందుకు వస్తాయి. మళ్లీ మీరు వేరే విమానంలో గమ్యస్థానానికి చేరేంత వరకూ అయ్యే వ్యయాలన్నింటిని పాలసీ భరిస్తుంది. అయితే, ఆ ఖర్చులన్నీ వాస్తవంగా చేసి ఉండాలి. భోజనం, వసతి, రవాణా ఖర్చులకు అయిన బిల్లులను సమర్పించాల్సి ఉంటుంది. ఆలస్యానికి కారణం ఏమిటన్నదీ ముఖ్యమే. ట్రాఫిక్‌ లేదా మీరు వస్తున్న మార్గంలో ప్రమాదం కారణంగా రాకపోకలు నిలిచిపోయినప్పుడు లేదా మీరు ఒక విమానంలో ప్రయాణిస్తూ.. అది ఆలస్యం కావడం వల్ల కనెక్టింగ్‌ విమానం వెళ్లిపోవడంలాంటి సందర్భాల్లో ఈ పాలసీ పరిహారం ఇస్తుంది.

విదేశాల్లో విహార యాత్రలకు వెళ్లిన వారు.. తమ ప్రయాణ సమయాలను కచ్చితంగా పాటించేలా చూసుకోవాలి. అవసరాన్నిబట్టి, కాస్త ముందుగానే చేరుకునేలా ఉండాలి. మనం ఆలస్యం చేస్తే విమానం ఆగదు.. అంతేకాదు.. ఆనందంగా ఉండాల్సిన సమయంలో అనవసర ఆందోళనకు చెందుతాం.

ఇంటిలో దొంగలు..

ఇంటికి తాళం వేసిన యాత్రలకు వెళ్లినప్పుడు ఇక్కడ రక్షణ కూడా పెద్ద సవాలే. తాళం వేసిన ఇంటికి కన్నం పెట్టేవారు పెరిగిపోయిన ఈ రోజుల్లో మనం విహార యాత్రలకు వెళ్లినప్పుడు ఇంటికి తగిన భద్రత కల్పించడమూ అవసరమే. ఇందుకోసం ప్రయాణ బీమాలోనే గృహ బీమా అంతర్గతంగా ఉంటుంది. దీన్ని పాలసీలో ఉండేలా చూసుకోవడం అవసరం. ఇంట్లోని వస్తువులను బట్టి, వేటికి బీమా ఉండాలన్నది మీరే నిర్ణయించుకునే వీలుంటుంది. మీరు ఎంచుకున్నదాన్ని బట్టి, ప్రీమియం నిర్ణయిస్తారు.
విదేశాలకు విహార యాత్రలకు వెళ్లేప్పుడు ప్రయాణ బీమా తీసుకోవడంతోనే సరిపెట్టకుండా.. అందులో దేనికి అది వర్తించదన్న సంగతినీ పూర్తిగా తెలుసుకోవాలి. 
ముందస్తు వ్యాధుల చికిత్సకు: ప్రయాణ బీమా పాలసీ తీసుకోవడం కన్నా ముందే ఉన్న వ్యాధుల వల్ల ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అలాంటి చికిత్సకు ఈ బీమా ఎలాంటి బాధ్యత వహించదు. అయితే, పాలసీ తీసుకున్న తర్వాత ఏదైనా అత్యవసర అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు జరిగిన ఆర్థిక నష్టానికి మాత్రం ఈ పాలసీ ఆ మేరకు పరిహారం అందిస్తుంది. 
సాహస క్రీడల్లో పాల్గొంటే: స్వదేశంలోనూ, విదేశాల్లోనూ సాహస క్రీడలను ఇష్టపడేవారు ఎంతోమంది. స్కై డైవింగ్‌, రాఫ్టింగ్‌, స్కూబా డైవింగ్‌, బంగీ జంపింగ్‌లాంటి వాటిల్లో పాల్గొన్నప్పుడు ఏదైనా జరిగితే... ఎలాంటి పరిహారం అందదనే నిబంధన చాలా బీమా పాలసీలు పాటిస్తున్నాయి. కొన్ని బీమా సంస్థలు మాత్రం.. ఇలాంటి సాహస క్రీడలను ప్రత్యేక అనుబంధ పాలసీలో భాగంగా రక్షణ కల్పిస్తున్నాయి. అయితే, సాధారణ ప్రయాణ బీమా పాలసీతో పోలిస్తే వీటికి ప్రీమియం కాస్త అధికంగానే ఉంటుంది. 
ప్రకృతి వైపరీత్యాలు: ప్రయాణ బీమాలో భాగంగా ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదైనా నష్టం జరిగితే పరిహారం లభిస్తుంది. గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే.. మీరు పాలసీ తీసుకున్న తర్వాత సంభవించిన వైపరీత్యాల వల్ల ఇబ్బందులకే ఇది లభిస్తుంది. ఉదాహరణకు మీరు పాలసీ తీసుకోకముందు తుపాను ప్రారంభమైంది అనుకోండి.. అప్పుడు దాని వల్ల వచ్చే ఇబ్బందులకు పరిహారం ఇవ్వరు. అదే.. పాలసీ తీసుకున్న తర్వాత వాతావరణ శాఖ తుపానును గుర్తించి, దానికి పేరు పెట్టిందనుకోండి.. ఎలాంటి అభ్యంతరాలూ ఉండవు. 
అన్ని వస్తువులకూ వర్తించదు: మీ బ్యాగులో ఉండే ప్రతి వస్తువుకూ ప్రయాణ బీమాలో రక్షణ ఉండదు. కొన్ని వస్తువులను బీమా పాలసీ లెక్కలోకి తీసుకోకపోవచ్చు. బ్యాగులో ఉండే వస్తువులను బట్టి, ఎంత మేరకు పాలసీ తీసుకోవాలన్నది నిర్ణయించుకోవాలి. ముఖ్యంగా ఖరీదైన ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు అధికంగా ఉన్నప్పుడు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా సన్‌ గ్లాసెస్‌, మొబైల్‌, టిక్కెట్లు, నగదు, పాస్‌పోర్టుల విషయంలో ఈ పాలసీలు పరిహారం ఇస్తుంటాయి.

క్లెయిం ఎలా?

ప్రయాణ బీమా పాలసీని క్లెయిం చేసుకునేందుకు రెండు మార్గాలున్నాయి. ఒకటి నగదు రహితం (క్యాష్‌లెస్‌), మరోటి తిరిగి చెల్లించడం (రీఇంబర్స్‌మెంట్‌). ప్రయాణాల్లో అనారోగ్యం బారినపడితే.. నగదు రహిత చికిత్సలకే అవకాశం ఉంటుంది. అక్కడ బీమా సంస్థకు సేవలనందించే థర్డ్‌పార్టీ సర్వీస్‌ ప్రొవైడర్‌ (టీపీఏ)ను సంప్రదించి, ఈ క్లెయిం పొందవచ్చు. రీఇంబర్స్‌మెంట్‌ కోసం అవసరమైన పత్రాలు పూర్తి చేసి, అన్ని బిల్లులనూ సమర్పించాల్సి ఉంటుంది. మీరు స్వదేశానికి వచ్చిన ఏడు రోజుల్లోగా క్లెయింను సమర్పించాలి. అప్పుడు నిబంధనలను బట్టి, మీకు రావాల్సిన పరిహారాన్ని చెల్లిస్తారు.

తరుణ్‌ మాథూర్‌,చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌,జనరల్‌ ఇన్సూరెన్స్‌

policybazaar.com

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని