Updated : 22/01/2021 17:59 IST
రెండు టర్మ్‌ పాలసీలు తీసుకోవచ్చా?

నేను కొంత మొత్తాన్ని రుణంగా తీసుకోవాలని అనుకుంటున్నాను. వ్యక్తిగత రుణం తీసుకోవడం మేలా? లేదా.. నా దగ్గరున్న మ్యూచువల్‌ ఫండ్లు, షేర్లను హామీగా పెట్టి అప్పు తీసుకోవాలా? ఏది మంచిది? - సాయి

సాధారణంగా వ్యక్తిగత రుణాలకు వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, మీ దగ్గరున్న మ్యూచువల్‌ ఫండ్లు, షేర్లను హామీగా ఉంచి రుణం తీసుకోవడాన్ని పరిశీలించవచ్చు. అయితే, వీటి విలువలో 50శాతం మాత్రమే రుణం వస్తుంది. ఇక్కడ మరో సంగతినీ గుర్తుంచుకోవాలి.. అనుకోని పరిస్థితుల్లో మీ పెట్టుబడుల విలువ పడిపోతే.. ఆ 50శాతంలో ఎంత తగ్గిందో దాన్ని మీరు భర్తీ చేయాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఆయా షేర్లు, మ్యూచువల్‌ ఫండ్లను రుణసంస్థలు విక్రయించేందుకు హక్కు ఉంటుంది. ఈ రుణాలను తీసుకున్నప్పుడు రుణ మొత్తంలో ఎంత వాడుకుంటే.. అంతే మొత్తానికి వడ్డీ విధిస్తారు.

నేను మ్యూచువల్‌ ఫండ్లు, షేర్లలో క్రమం తప్పకుండా మదుపు చేసేవాడిని. రెండేళ్ల కిత్రం నేను యూఏఈకి వెళ్లాను. అక్కడి నుంచి ఈ పెట్టుబడులను కొనసాగించే అవకాశం ఉందా? - మోహన్‌

మీరు మన దేశంలో ఉండగా.. పెట్టుబడులు ప్రారంభించారు.. అంటే రెసిడెంట్‌ ఇండియన్‌గా పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు మీరు ఎన్‌ఆర్‌ఐ హోదాతో ఉన్నారు. కాబట్టి, మీరు మీ పెట్టుబడుల వివరాల్లో కేవైసీని మరోసారి మార్చాల్సి ఉంటుంది. ఆ తర్వాతే మీరు పెట్టుబడులను కొనసాగించే అవకాశం ఉంటుంది.

ఆరు నెలలుగా మూడు వేర్వేరు మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లో మదుపు చేస్తున్నాను. అయితే, వివరాల్లో నా పేరు తప్పుగా వచ్చింది. దీంతోపాటు నా చిరునామానూ మార్చుకోవాలని అనుకుంటున్నాను. దీనికోసం నేను ఏం చేయాలి? అన్ని ఫండ్‌ సంస్థల దగ్గరకూ వెళ్లి వివరాలు మార్పించుకోవాల్సిందేనా? - సురేశ్‌

మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసేటప్పుడు సరైన వివరాలు ఉండేలా చూసుకోవాలి. చిరునామా మారినా.. వెంటనే ఆ వివరాలను ఫండ్‌ సంస్థకు తెలియజేయాలి. ప్రస్తుతం మీ దగ్గర రెండు మార్గాలున్నాయి... మొదటిది.. మీరు ప్రతి మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ దగ్గరకు వెళ్లి.. మీ పేరు, చిరునామా మార్చాలని దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా.. ఎంఎఫ్‌యుటిలిటీ వెబ్‌సైట్‌లో కామన్‌ అకౌంట్‌ నెంబరు (సీఏఎన్‌)ను తీసుకోవచ్చు. మీరు ఇందులో మార్పులు చేస్తే.. అన్ని ఫండ్‌ సంస్థల్లోనూ కొత్త వివరాలు నమోదవుతాయి.

టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని తీసుకోవాలని అనుకుంటున్నాను. రెండు వేర్వేరు సంస్థల నుంచి బీమా పాలసీలు తీసుకోవచ్చా? ఏదైనా జరిగినప్పుడు రెండు బీమా సంస్థలూ క్లెయిం చెల్లిస్తాయా? - మధు

మీరు నిరంభ్యంతరంగా రెండు బీమా సంస్థల నుంచి టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని తీసుకోవచ్చు. అయితే, మొదటి పాలసీ వివరాలను తప్పనిసరిగా రెండో బీమా పాలసీ తీసుకునేటప్పుడు ప్రతిపాదన పత్రంలో తెలియజేయాలి. మీరు మొదటి పాలసీ వివరాలు తెలియజేసిన తర్వాత.. రెండో బీమా సంస్థ పాలసీ ఇస్తే.. అప్పుడు రెండు బీమా సంస్థల నుంచీ పరిహారం లభించడంలో ఎలాంటి ఇబ్బందీ ఉండదు.

ఆరోగ్య బీమా పాలసీని పునరుద్ధరించుకోవాలని ఆలోచన. అయితే, ప్రీమియం గతంతో పోలిస్తే పెరిగింది. ఇతర బీమా సంస్థలతో పోల్చి చూస్తే ఇది అధికమే. ఇప్పుడు నేను ఏం చేయాలి? బీమా సంస్థను మార్చుకోవచ్చా? - అఖిల్‌

మీ పాలసీని ఇప్పుడున్న బీమా సంస్థ నుంచి వేరే సంస్థకు బదిలీ చేసుకునే వీలుంది. దీనికన్నా ముందు మీ పాత పాలసీలో ఉన్న ప్రయోజనాలన్నీ మీరు మారుతున్న బీమా సంస్థలో ఉన్నాయా లేదా ఒకసారి పరిశీలించండి. క్లెయిం పరిష్కారం ఎలా ఉంది అనేదీ చూడండి. మీ పాలసీ వ్యవధి ముగియడానికి 20 రోజుల ముందే పోర్టబిలిటీ కోసం దరఖాస్తు చేసుకోవాలి.

- సాయి కృష్ణ పత్రి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని