డబ్బు అత్యవసరం అయినప్పుడు క్షణాల్లో ఎక్కడ రుణం దొరుకుతుందా? అనేది తప్ప వేరే విషయాన్ని పట్టించుకోరు. ఈ బలహీనతే చాలా రుణ యాప్‌లు సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అవసరానికి ఆదుకున్నట్లుగా చెబుతూ... రుణగ్రహీతలను పట్టి పీడిస్తున్నాయి. ఎంతోమంది ఈ రుణ యాప్‌ల ఆగడాలకు ఏం చేయాలో తెలియక భయాందోళనలకు గురయ్యారు. ఎలాంటి అధీకృత అనుమతులూ లేకుండానే ఇవి అప్పులను ఇస్తుంటాయి. ఆర్బీఐ ఇప్పటికే రుణగ్రహీతలను ఈ విషయంలో అప్రమత్తం చేసింది. మరి.. వీటి బారిన పడకుండా.. మన అవసరానికి సరైన చోట మాత్రమే అప్పు తీసుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో తెలుసుకుందామా!
రుణం కావాలి అని.. ఆన్లైన్లో వెతికితే... పదుల సంఖ్యలో యాప్‌లు కనిపిస్తాయి. వీటిలో నిజంగా ఏది గుర్తింపు ఉన్నదీ.. ఏది అనధికారం అనేది గుర్తించడమే మనం చేయాల్సిన మొదటి పని. మన దగ్గర్నుంచి రుణదాతలు కేవైసీ (మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి) పత్రాలను తీసుకుంటాయి. అలాగే.. మనం మన రుణదాత గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ప్లేస్టోర్, యాప్స్టోర్లలో కనిపించే యాప్‌లన్నీ నిబంధనల మేరకే వ్యాపారం చేస్తున్నాయని కచ్చితంగా చెప్పలేం. అందుకే, ఆ యాప్‌లు ఏ సంస్థకు చెందినవి అనేది మనం చూడాలి..
* యాప్ కనిపించగానే దాన్ని ఇన్స్టాల్ చేసుకోవద్దు. ముందుగా దాని గురించి ఇతర వివరాలేమైనా ఉన్నాయా చూడండి. దానికి వెబ్సైట్లాంటిది ఉందా తెలుసుకోండి. చైనాకు చెందిన యాప్‌లకు ఎలాంటి వెబ్సైట్లూ ఉండవు. ఇక్కడో మనం ఆగిపోవాలి. వెబ్సైటు లేని యాప్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్లోడ్ చేసుకోవద్దు.
* వెబ్సైటు ఉంటే.. అందులోకి వెళ్లి ఆ సంస్థ పూర్తి వివరాలను తనిఖీ చేయాలి. ఆ సంస్థ పేరేమిటి? చిరునామా? ఆర్బీఐ దగ్గర నమోదయ్యిందా.. లేదా బ్యాంకు, ఎన్బీఎఫ్సీ అనుబంధంగా పనిచేస్తోందా పరిశీలించాలి. ప్రతి సంస్థా తన కంపెనీ ఐడెంటిఫికేషన్ నెంబరు (సీఐఎన్), ఆర్బీఐ దగ్గర రిజిస్ట్రేషన్ అయిన సర్టిఫికెట్ వివరాలనూ తప్పకుండా ప్రదర్శించాలి. అవి లేకపోతే.. అది నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నట్లేనని భావించాలి.
* ఆ యాప్ ఆర్బీఐ దగ్గర నమోదైన ఎన్‌బీఎఫ్‌సీగా పేర్కొంటే... ఎన్బీఎఫ్సీ వెబ్సైటులోకి వెళ్లి తనిఖీ చేయాలి. యాప్‌ను డౌన్లోడ్ చేయకముందే అది ఎన్బీఎఫ్సీ దగ్గర రిజిస్ట్రేషన్ అయిందా లేదా చూసుకోవాలి.
* ఆర్బీఐ దగ్గర నమోదైన ఎన్బీఎఫ్సీలు తప్పకుండా నిబంధనలను పాటించాల్సిందే. కేవైసీ దగ్గర్నుంచి, రుణాన్ని వసూలు చేసేదాకా వినియోగదారుల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రత్యేక ఫిర్యాదుల విభాగం ఉండాలి.
* ప్లేస్టోర్, యాప్స్టోర్లలో ఆయా యాప్‌లకు సంబంధించిన సమీక్షలనూ చదవండి. వీటిలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తెలిసిపోతుంది.
* రుణదాతల వెబ్సైటు నుంచి నేరుగా యాప్‌ను ఎప్పుడూ డౌన్లోడ్ చేసుకోవద్దు.
సమాచారం రహస్యంగా..
కొన్నిసార్లు రుణగ్రహీతలకు సంబంధించిన సమాచారాన్ని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తెలుసుకునేందుకు కొన్ని వివరాలను అడుగుతుంటారు. ముఖ్యంగా క్రెడిట్ స్కోరు, రుణ చెల్లింపుల చరిత్రలాంటివి తెలుసుకోవడం, రుణాన్ని ఎందుకు తీసుకుంటున్నారో అర్థం చేసుకోవడం కోసం ఈ వివరాలు కావాల్సి ఉంటుంది. అంతేకాకుండా రుణగ్రహీతల అవసరాలకు తగ్గట్టుగా రుణం ఇవ్వడం, కొన్నిసార్లు తక్కువ వడ్డీకే అప్పు అందించడం, అధిక మొత్తంలో అప్పు ఇచ్చేందుకు వీలుందాలాంటి అంశాలను దీనిద్వారా విశ్లేషిస్తారు.
* అయితే.. కొన్ని యాప్‌లను డౌన్లోడ్ చేసుకునే సమయంలో మీ ఫోనులో ఉన్న సమాచారాన్ని చదివేందుకు అనుమతులు అడుగుతుంటాయి. మనకు రుణం కావాలన్న తొందరలో వాటిని చదవకుండానే అంగీకరిస్తుంటాం. ఇలాంటప్పుడే కాస్త ఇబ్బంది. ఫోనులో ఉన్న కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులు ఇలా అందరి నెంబర్లూ ఆయా యాప్‌లు తెలుసుకుంటాయి. అనుకోని సందర్భాల్లో అప్పు తీసుకునే వ్యక్తి వాయిదాలు సరిగా చెల్లించకపోతే.. ఆయా సంస్థలు తాము సేకరించిన ఫోన్ నెంబర్లన్నింటికీ ఫోన్లు చేయడం మొదలు పెడతాయి. రుణం తీసుకున్న వ్యక్తితోపాటు.. కుటుంబ సభ్యులనూ, మిత్రులనూ వేధిస్తాయన్నమాట.
* అవసరానికి మించి ఎలాంటి సమాచారాన్నీ సేకరించేందుకు మీరు అనుమతిని ఇవ్వకూడదు. యాప్‌లో ఎలాంటి సమాచారం అడుగుతారనే విషయాన్ని ముందే పేర్కొంటారు. దీనికి మించి ఏదైనా అడుగుతున్నారంటే.. కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. అన్నింటికన్నా ముఖ్యంగా.. యాప్ ప్రైవసీ పాలసీని చదివి అర్థం చేసుకోవాలి. ఆ తర్వాతే రుణం తీసుకునేందుకు ముందుకు వెళ్లాలి.
రుణం లభించాక..
రుణానికి దరఖాస్తు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. కొన్నిసార్లు దరఖాస్తు పత్రాన్ని అంగీకరిస్తున్నదీ లేనిదీ కొన్ని నిమిషాల వ్యవధిలోనే తేలిపోతుంది.
* ఒకసారి మీకు రుణం ఇవ్వడానికి అంగీకరించిన తర్వాత.. రుణదాతలు విధించే షరతులను క్షుణ్నంగా తెలుసుకోండి. రుణదాతలు మీకు రుణం ఇస్తానని చెప్పిన తర్వాత.. దాన్ని అంగీకరించాలా.. వద్దని చెప్పాలా అనేది మీ నిర్ణయమే. ముఖ్యమైన నియమ నిబంధనలను ఒకటికి రెండుసార్లు పరిశీలించండి. రుణం చెల్లించే విషయంలోనూ ఎలాంటి నిబంధనలు పెట్టారో చూసుకోండి.
* యాప్ ఎంపిక చేసుకున్నప్పటి నుంచీ.. రుణం మంజూరయ్యేదాకా.. ఎక్కడైనా ఇబ్బంది ఎదురైనా.. సమస్య కనిపించినా.. వెంటనే మొత్తం ప్రక్రియను ఆపేయండి. వేరే ఇతర రుణగ్రహీతను సంప్రదించండం మేలు.
ఒకసారి రుణం తీసుకున్న తర్వాత దాన్ని క్రమం తప్పకుండా తీర్చాల్సిన బాధ్యత రుణగ్రహీత మీద ఉంటుంది. లేకపోతే.. కొన్ని అదనపు రుసుముల్లాంటివి భరించాల్సి వస్తుంది. రుణం తీర్చలేని పరిస్థితి ఉంటే.. రుణదాతను సంప్రదించి.. వాస్తవాలను తెలియజేయాలి. వ్యవధి కావాలని అడగండి. తప్పించుకొని తిరగడం వల్ల ఇబ్బందులు తప్ప.. సమస్య పరిష్కారం కాదనేది గుర్తుంచుకోండి. ఆందోళన చెందడం వల్ల ఫలితం ఉండదు. రుణదాతల నుంచి వేధింపులు ఎదురైతే.. నియంత్రణ సంస్థలకు ఫిర్యాదు చేసేందుకు వెనకాడవద్దు.
- అనిల్ పినపాల, సీఈఓ, వివిఫై ఇండియా