గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

సంపాదకీయం

ప్రగతి రథానికి సౌరశక్తి!

శిలాజ ఇంధనాలపై ఆధారపడి మానవాళి సాగించిన ప్రగతి ప్రస్థానం- పెను పర్యావరణ సంక్షోభాలకు అంటుకట్టి మనిషి అస్తిత్వాన్నే ప్రశ్నార్థకం చేస్తోంది. పర్యావరణ హితకర అభివృద్ధిని ప్రపంచదేశాలు పలవరిస్తున్నవేళ- కొత్త శతాబ్ది విద్యుత్‌ అవసరాలు తీర్చడంలో సౌర విద్యుత్తుదే కీలక పాత్ర కానుంది. మధ్యప్రదేశ్‌లోని రీవాలో ఏర్పాటు చేసిన 750 మెగావాట్ల భారీ సౌర విద్యుత్‌ ప్లాంటు ప్రారంభోత్సవవేళ ప్రధాని మోదీ చెప్పినట్లు- స్వావలంబనకు ప్రతీక అయిన సౌరశక్తి దేశ విద్యుత్‌ అవసరాలకు పూర్తిగా అక్కరకొస్తుంది! అంతకుమించి ఏటా 15లక్షల టన్నుల బొగ్గుపులుసు వాయువుకు సమానమైన వినాశకర ఉద్గారాల్ని దేశం తగ్గించగల వీలు ఆ ఒక్క ప్లాంటు ద్వారానే సాధ్యపడనుంది. 2022 నాటికి 175 గిగావాట్ల సౌరశక్తి ఉత్పాదన సాధించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకొన్న ఇండియా ఇప్పటికి 34.6 గిగావాట్ల సామర్థ్యాన్ని ఒడిసిపట్టింది. సౌరఫలకాలు, బ్యాటరీ, నిల్వ తయారీ సామర్థ్యాన్ని ఇండియా దేశీయంగా ఇనుమడింపజేసుకోకుంటే- సౌరశక్తిని పూర్తిస్థాయిలో వినియోగించుకొనే అవకాశం చేజారిపోతుందన్న ప్రధాని విశ్లేషణ పూర్తిగా అర్థవంతం. సౌర విద్యుత్‌ తయారీ ఉపకరణాల మార్కెట్టునూ చౌక ఉత్పాదనలతో గుప్పిట పట్టిన చైనానుంచి 2018-19లో రూ.21,000కోట్ల మేర ఇండియా దిగుమతులు చేసుకొందన్నది యథార్థం. 2014 లగాయతు సౌరవిద్యుత్‌ ఉత్పాదనలో గణనీయ ప్రగతి సాధించిన ఇండియా- 80శాతం ఉపకరణాల కోసం చైనామీదే ఆధారపడుతోంది. ఆత్మ నిర్భర్‌ భారత్‌ (స్వావలంబన భారత్‌) లక్ష్యసాధనలో భాగంగా సౌరవిద్యుత్‌ ఉపకరణాలన్నీ దేశీయంగానే ఉత్పత్తి కావాలని ప్రధాని కోరుతున్నారు. ఏటా 20 గిగావాట్ల సోలార్‌ సెల్‌ తయారీకి డిమాండు ఉన్నా దేశీయంగా సామర్థ్యం మూడు గిగావాట్లకే పరిమితమైంది. ఈ అవరోధాల్ని అధిగమించేలా కేంద్ర సర్కారు కార్యాచరణ పదును తేలాలి!
దేశార్థిక రథం కుదుపుల్లేకుండా సాగాలంటే, కీలకమైన ఇంధన భద్రతపై దీర్ఘకాలిక వ్యూహంతో ముందడుగేయాలి. 2035 నాటికి ఇండియా ఇంధన వినియోగం ఏటా 4.2శాతం పెరగనుంది. 2030 నాటికి 40 శాతం విద్యుత్‌ ఉత్పాదనకు శుద్ధ ఇంధన వనరుల్నే వినియోగిస్తామని ఇండియా వాగ్దానం చేసింది. 2011దాకా అత్యుత్తమ సౌర ఉపకరణాల భారీ ఎగుమతిదారుల్లో ఒకటిగా ఉన్న ఇండియా- నిలకడలేని సర్కారీ నిర్ణయాల కారణంగానే కుదేలైపోయింది. ఆ చేదు గతం పునరావృతం కారాదన్నా, సౌర విద్యుత్‌ తయారీలో ఇండియా స్వావలంబన సాధించాలన్నా- అన్ని దశల్లోనూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల్లో సమన్వయం, సారూప్యం ఉండి తీరాలి! సౌర విద్యుత్‌ ఉపకరణాల తయారీ దేశీయంగా సువ్యవస్థితమైతే- 2030 నాటికి రూ.3.2లక్షల కోట్ల దిగుమతుల బిల్లు ఆదాతోపాటు, వచ్చే అయిదేళ్లలో ప్రత్యక్షంగా 5000 మందికి, పరోక్షంగా లక్షా పాతిక వేలమందికి ఉపాధి లభిస్తుంది. విద్యుత్‌ రైళ్ల అవసరాలు నేరుగా తీర్చేలా మధ్యప్రదేశ్‌లోని బినాలో భారతీయ రైల్వే ప్రత్యేకంగా సౌర విద్యుత్కేంద్రాన్నే ఏర్పాటుచేసింది. ఒకనాడు యూనిట్‌ రూ.16-17 పలికిన సౌరవిద్యుత్‌ ధర భారీగా దిగివచ్చిన తరుణంలో పరిశుద్ధ ఇంధనంగా దాని వినియోగం 2030 నాటికి 450 గిగావాట్లకు చేరేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ కార్యాచరణ సత్వరం పట్టాలకెక్కాలి! పునరుత్పాదక ఇంధన వనరులు మూడింతల ఉపాధి కల్పనకు దోహదపడతాయంటున్న ఐక్యరాజ్యసమితి- కరోనా సంక్షోభంలోనూ ఇండియా అడుగులు సౌర విద్యుత్‌ దిశగా స్థిరంగా పడుతున్నాయని ప్రశంసించింది. దేశీయంగా ఫొటో ఓల్టాయిక్‌ ఉపకరణాల ఉత్పత్తిని ప్రోత్సహించి, విద్యుత్‌ సరఫరా ఒప్పందాల్ని మన్నించే సానుకూల వాతావరణం ఏర్పడితే భారత్‌ భవిత తేజోవంతమవుతుంది!

Tags:

సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని