తిరుమల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న పెద్ద ఆస్తి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారే అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. గురువారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న చంద్రబాబుకు తితిదే అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని దేవుడిని ప్రార్థించినట్లు చెప్పారు.
‘‘రాష్ట్రానికి ఉన్న పెద్ద ఆస్తి శ్రీవారు. శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. గతంలో శ్రీవారి పింక్ డైమండ్ పోయిందంటూ ఆరోపణలు చేసిన వ్యక్తిని తిరిగి చేర్చుకోవడం మంచి సంప్రదాయం కాదు. మనిషిని దేవుడితో పోల్చడం సరికాదు. ఇలాంటి అపచారాలు గతంలో కూడా చేశారు’’ అని చంద్రబాబు అన్నారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తదితరులు చంద్రబాబుతో పాటు ఉన్నారు.