దిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ భేటీ ముగిసింది. సుమారు తొంభై నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై అమిత్ షాతో జగన్ చర్చించారు. పోలవరం ప్రాజెక్టు రివైజ్డ్ కాస్ట్ కమిటీ (ఆర్‌సీసీ) సిఫార్సు మేరకు ప్రాజెక్టు వ్యయాన్ని రూ.55,656.87 కోట్లుగా ఆమోదించాలని సీఎం జగన్ కోరారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు రీ నోటిఫికేషన్ జారీచేయాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు అంశాన్ని 2019 ఎన్నికల్లో భాజపా తన మేనిఫెస్టోలో ఉంచిందని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. విజయనగరం జిల్లా సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు తగిన చర్యలు చేపట్టేలా సంబంధిత శాఖను ఆదేశించాలని కోరారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యేక హోదాతో కేంద్రం నుంచి నిధులు లభిస్తాయి. దీనివల్ల ఆర్థిక భారం క్రమంగా తగ్గుతుంది. కొత్త పరిశ్రమలు వస్తాయి. మరిన్ని ఉద్యోగావకాశాలు లభిస్తాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 332 కేంద్రాల్లో కొవిడ్ వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైందని రాబోయే 10 రోజుల్లో ఆరోగ్య సిబ్బంది అందరికీ వాక్సినేషన్ పూర్తి చేసేందుకు చేపట్టిన చర్యలను అమిత్ షాకు వివరించారు. ప్రజారోగ్య రంగాన్ని పటిష్టం చేసేందుకు నాణ్యమైన వైద్య సేవల కోసం వైద్యులు, నర్సుల సిబ్బంది సంఖ్యను పెంచాల్సి ఉంది. దీనిలో భాగంగా నూతనంగా 13 వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఇప్పటికే మూడు కళాశాలలకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని, మిగిలిన 10 కళాశాలలతో పాటు వాటికి అనుబంధంగా నర్సింగ్ కళాశాలలను ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దిశ బిల్లుకు, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు బిల్లుకు కేంద్రం ఆమోదం తెలిపేలా తగిన చర్యలు చేపట్టాలని సీఎం జగన్ కోరారు.
ఇవీ చదవండి..
ఉమాపై కొడాలి నాని మరోసారి తీవ్ర విమర్శలు
తప్పుడు కేసులకు భయపడం: దేవినేని ఉమ