రాష్ట్రాల అభిప్రాయాలు కోరిన సుప్రీంకోర్టు
దిల్లీ: దేశంలో విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు 50% మించరాదంటున్న మండల్ తీర్పు (ఇందిరా సాహ్నీ కేసు)ను పునఃసమీక్షించాల్సి ఉందా అనే విషయంలో అభిప్రాయాలు తెలపాల్సిందిగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు కోరింది. ఈ మేరకు వాటికి నోటీసులు జారీ చేసింది. 1992లో వెలువడిన చరిత్రాత్మక తీర్పు తర్వాత చోటు చేసుకున్న రాజ్యాంగ సవరణలు, వెలువడిన తీర్పులు, సామాజిక మార్పుల నేపథ్యంలో దానిని విస్తృత ధర్మాసనం పరిశీలనకు పంపాల్సిన అవసరం ఉందా లేదా అనేది తెలపాలని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, జస్టిస్ హేమంత్‌గుప్తా, జస్టిస్ ఎస్.రవీంద్రభట్‌ల ధర్మాసనం ఈ నోటీసుల్లో పేర్కొంది. విచారణను ఈ నెల 15న ప్రారంభిస్తామని, దాని నిమిత్తం రాష్ట్రాలు క్లుప్తంగా తమ అభిప్రాయాలను పంపాలని సూచించింది.
రాష్ట్రాల శాసనాధికారాలను ఆ సవరణ కాలరాస్తోందా?
మహారాష్ట్రలో మరాఠాలకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ అక్కడి ప్రభుత్వం 2018లో చేసిన చట్టానికి సంబంధించి.. ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులవారికి ప్రయోజనాలు కల్పించడానికి రాష్ట్రాలకు ఉన్న శాసనాధికారాన్ని 102వ రాజ్యాంగ సవరణ (వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్‌సీబీసీ) నిర్మాణం, విధులు, అధికారాలు) కాలరాస్తోందా అనేది తెలుసుకోగోరింది. మహారాష్ట్ర తరఫు న్యాయవాదుల వాదనలు ఆలకించిన తర్వాతే రాష్ట్రాల అభిప్రాయాలు వింటామని తెలిపింది. ఒక కులం సామాజికంగా, ఆర్థికంగా వెనుకబాటుకు గురైందని ప్రకటించడానికి రాష్ట్రపతికి అధికారం కల్పిస్తున్న 342-ఏ నిబంధన వల్ల రాష్ట్రాల శాసనాధికారాలు, రాజ్యాంగం ప్రబోధించిన సమాఖ్య విధానం ఏమైనా దెబ్బతింటున్నాయా అనేది తెలుసుకునేందుకు ఆరు ప్రశ్నల్ని సంధించింది.