మహిళల పట్ల మాకు అపారమైన గౌరవం: సుప్రీం
దిల్లీ: ఒక అత్యాచార కేసు విచారణ సందర్భంగా గతవారం తాము చేసిన కొన్ని వ్యాఖ్యలు ‘పూర్తిగా వక్రీకరణ’కు గురయ్యాయని సుప్రీం కోర్టు సోమవారం పేర్కొంది. మహిళలు అంటే తమకు అపారమైన గౌరవం ఉందని వ్యాఖ్యానించింది. కోర్టు ప్రతిష్ఠను కాపాడే బాధ్యత న్యాయవాదులపై కూడా ఉందని స్పష్టంచేసింది. మహిళా దినోత్సవం నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఒక అత్యాచార కేసు విచారణలో.. మైనర్ అయిన బాధితురాలికి 18 ఏళ్లు వచ్చాక ఆమెను పెళ్లి చేసుకుంటావా అని నిందితుడిని కోర్టు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దీనిపై మహిళా సంఘాలు, మేధావులు, రచయితలు అసంతృప్తి వ్యక్తంచేశారు. సదరు వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని జస్టిస్ బోబ్డేకు లేఖ రాశారు.