ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో దేశంలోనే 12వ స్థానం
ఈనాడు డిజిటల్, చెన్నై: వేలూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(వీఐటీ) ఈ ఏడాది క్యూఎస్ సబ్జెక్ట్ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిందని, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో దేశంలో 12వ స్థానంలో నిలిచిందని వీఐటీ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. దీంతోపాటు ప్రపంచంలోని టాప్ 450 విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా తమ సంస్థ నిలిచిందని వివరించారు. ‘క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ సబ్జెక్ట్-2021’ మొత్తం 51 విభాగాలను కవర్ చేస్తుందని వెల్లడించారు. ఏటా ఒక నిర్దిష్ట సబ్జెక్టులో ప్రముఖ విశ్వవిద్యాలయాన్ని గుర్తించడానికి విద్యార్థులకు ఇది ఉపకరిస్తుందని పేర్కొన్నారు. ఈ సంవత్సరం క్యూఎస్ ప్రచురించిన జాబితాలో వీఐటీలోని ఏడు సబ్జెక్టులు చోటు సాధించాయన్నారు. వాటిలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (ఈఈఈ), మెకానికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీలు గత సంవత్సరంతో పోలిస్తే 50 స్థానాలు మెరుగుపడినట్లు వివరించారు. వీటిలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఈఈఈ దేశంలోనే టాప్-10లో ఉన్నట్లు వెల్లడించారు. ప్రపంచంలోనే ఈఈఈ టాప్-300లో ఉన్నట్లు... కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, మెకానికల్ ఇంజినీరింగ్‌లు టాప్-400లో ఉన్నాయని తెలిపారు. వీఐటీకి చెందిన గణితం, జీవశాస్త్రాలు తొలిసారిగా క్యూఎస్ సబ్జెక్ట్ ర్యాంకింగ్‌లో ప్రవేశించాయని... వాటికి ప్రపంచంలో టాప్ 500, 600 స్థానాలు దక్కాయని పేర్కొన్నారు.