32 మంది మృతి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని మార్కెట్ ప్రాంతంలో గురువారం జంట ఆత్మాహుతి బాంబు దాడులు జరగడంతో కనీసం 32 మంది మరణించారు. 110 మంది గాయపడ్డారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. సెంట్రల్ బాగ్దాద్‌లోని బాబ్ అల్ షార్కీ దుస్తుల మార్కెట్‌లోని తయరాన్ స్క్వేర్ వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. జనం రద్దీ అధికంగా ఉండే ఈ ప్రాంతంలోకి తమ శరీరానికి బాంబులు, పేలుడు పదార్థాలు కట్టుకున్న ఇద్దరు వ్యక్తులు వచ్చారు. అందులో ఒకరు తనకు ఒంట్లో బాగోలేదంటూ గట్టిగా అరిచాడు. అది విన్న జనం అక్కడికి చేరడంతో వెంటనే తాను ధరించిన బెల్టులోని మీటను నొక్కడంతో బాంబులు పేలాయి. కొద్ది క్షణాల్లో రెండో వ్యక్తి కూడా తనను తాను పేల్చుకున్నాడు. ఇలా జంటగా ఆత్మాహుతి చేసుకోవడం చాలా అరుదు. రక్తంతో ఆ ప్రాంతం భయానకంగా మారింది. ముందస్తుగా జరగనున్న ఎన్నికలు, ఆర్థిక సంక్షోభమే ఇందుకు కారణాలని అనుమానిస్తున్నారు. ఇందుకు బాధ్యత వహిస్తూ ఏ సంస్థా ఇంతవరకు ప్రకటన విడుదల చేయలేదు. 2018లో అప్పటి ప్రధాని హైదర్ అల్ అబాదీ..ఇస్లామిక్ స్టేట్ మీద విజయం సాధించినప్పుడు కూడా సరిగ్గా ఇదే ప్రదేశంలో మానవ బాంబు పేలుడు జరిగింది. ఉనికి చాటుకోవడానికే ఇస్లామిక్ స్టేట్ సభ్యులు ఈ దారుణానికి పాల్పడ్డారని అధికారులు తెలిపారు.