ఈనాడు డిజిటల్, బెంగళూరు: కేంద్ర రక్షణ శాఖకు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్(ఆర్‌సీఐ) అభివృద్ధి చేసిన స్వదేశీ స్మార్ట్ యాంటీ ఎయిర్‌ఫీల్డ్(సా) అత్యాధునిక ఆయుధాన్ని హెచ్‌ఏఎల్‌కు చెందిన యుద్ధ విమానం హాక్-ఐ నుంచి విజయవంతంగా పరీక్షించారు. ఒడిశా తీరంలో విశ్రాంత వింగ్ కమాండర్లు పి.అశ్వత్, ఎం.పటేల్‌ల ఆధ్వర్యంలో ఈ పరీక్షలను నిర్వహించినట్లు హెచ్‌ఏఎల్ గురువారం బెంగళూరులో ప్రకటించింది. 125 కిలోల బరువున్న ఈ ఆయుధంతో శత్రు సైన్యాల బలగాలను వంద కిలోమీటర్ల దూరం నుంచే లక్ష్యంగా చేసుకోవచ్చని, రాడార్లు, బంకర్లు, ట్యాక్సీ ట్రాక్‌లు, రన్‌వేలను సులువుగా నాశనం చేస్తుందని హెచ్‌ఏఎల్ వెల్లడించింది. గతంలో ఒకసారి జాగ్వార్ యుద్ధ విమానం నుంచి ఈ ఆయుధం పనితీరును పరీక్షించినట్లు హెచ్‌ఏఎల్ ఆర్‌అండ్‌డీ డైరెక్టర్ అరూప్ ఛటర్జీ తెలిపారు.