అమిత్ షా వ్యాఖ్య
అహ్మదాబాద్: కరోనా నుంచి భారత్ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న తీరును ప్రపంచ దేశాలు ఆశ్చర్యంతో గమనిస్తున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. మహమ్మారి వచ్చిన తొలినాళ్లలో ఆర్థిక ప్రగతి దిగజారినా, తరువాత క్రమేణా కోలుకుందని ఇది ఆంగ్ల అక్షరం ‘వి’ రూపంలో కనిపిస్తోందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలూ కరోనా కారణంగా దెబ్బతిన్నా భారత్ ఒక్కటే పురోగతి సాధిస్తోందని తెలిపారు. గుజరాత్‌లోని శిలాజ్ వద్ద నిర్మించిన పై వంతెనను గురువారం వీడియో కాన్ఫరెన్స్ రూపంలో ప్రారంభించిన అనంతరం జరిగిన సమావేశంలో ప్రసంగించారు. కరోనాపై విజయం సాధిస్తున్నామని, ఆర్థిక రంగం మెరుగుపడుతుండడంతో పాటు, అందరికీ టీకాలు అందుతున్నాయని తెలిపారు. మోదీ పాలనలో మౌలిక వసతుల కల్పన రంగం బాగా అభివృద్ధి చెందిందని చెప్పారు. 2022 నాటికి అందరికీ ఇళ్లు అనే లక్ష్యాన్ని సాధిస్తామని తెలిపారు. అప్పటికి అన్ని ఇళ్లకూ పైపుల ద్వారా నీరు అందిస్తామని చెప్పారు.