సుప్రీం కోర్టులో పిటిషన్
వచ్చేవారం విచారిస్తానన్న ధర్మాసనం
దిల్లీ: దత్తత, సంరక్షణకు సంబంధించిన నిబంధనల్లో ఉన్న వైరుధ్యాలను తొలగించేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై వచ్చే వారం విచారణ జరుపుతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. భాజపా నేత, న్యాయవాది అశ్వనీ కుమార్ ఉపాధ్యాయ్ ఈ పిటిషన్ వేశారు. దత్తత, సంరక్షణకు సంబంధించిన నిబంధనలు వివక్షాపూరితంగా ఉన్నాయని, అవి రాజ్యాంగంలోని 14, 15, 21 అధికరణాలను ఉల్లంఘిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. హిందూ చట్టం ప్రకారం దత్తత పొందిన చిన్నారి.. తనను దత్తత తీసుకున్న తల్లిదండ్రుల ఆస్తిని పొందొచ్చని, ముస్లిం, క్రైస్తవ చట్టాల్లో ఆ వెసులుబాటు లేదని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ఉన్న మెరుగైన విధానాలను పరిశీలించి మూడు నెలల్లోగా ఏకీకృత నిబంధనలను రూపొందించేలా లా కమిషన్‌కు ఆదేశాలివ్వాలని కోరారు.
శాశ్వత జడ్జి నియామకానికి కొలీజియం పచ్చజెండా
బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ పుష్ప వీరేంద్ర గానెడివాలాను శాశ్వత జడ్జిగా నియమించే ప్రతిపాదనపై సుప్రీంకోర్టు కొలీజియం ఆమోద ముద్రవేసింది. జస్టిస్ పుష్ప 1969 మార్చి 3న మహారాష్ట్రలోని పరట్వాడాలో జన్మించారు. ఆమె వివిధ బ్యాంకులు, బీమా కంపెనీల తరఫున న్యాయవాదిగా పనిచేశారు. సుప్రీం కోర్టు కొలీజియంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే, న్యాయమూర్తులు జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్, జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఎ.ఎం.ఖాన్విల్కర్‌లు ఉన్నారు.