బైడెన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రపంచ నేతల ఆశాభావం
వాషింగ్టన్: ట్రంప్ హయాంలో దెబ్బతిన్న సంబంధాలను సరిచేసుకుంటూ ముందుకెళ్దామని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు పంపిన సందేశాల్లో పలువురు ప్రపంచ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.
‘‘ సుదీర్ఘమైన నాలుగేళ్ల తరువాత శ్వేత సౌధంలో ఐరోపాకు మిత్రుడు దొరికాడు.’’
-యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు, ఉర్సులా వాన్ డెర్ లెయెన్
‘‘దృఢ విశ్వాసం, లౌకిక జ్ఞానాన్ని మళ్లీ వెనక్కి తీసుకువచ్చి ఈయూ-అమెరికా బంధాలను బలోపేతం చేయాల్సి ఉంది.’’
-యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఛార్లెస్ మైఖెల్
‘‘నాటోలో కొత్త అధ్యాయం మొదలయింది. చైనా కారణంగా భద్రత పరంగా ముప్పు ఏర్పడడం, ఉగ్రవాద చర్యలు పెరగడంతో నాటో దేశాలన్నీ కలిసి పనిచేయాల్సి ఉంది.’’
-నాటో సెక్రటరీ జనరల్, జెన్స్ స్టొల్టెన్‌బర్గ్
‘‘మానవ కుటుంబం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న తరుణంలో ముందుచూపు కలిగిన ఉమ్మడి స్పందనలు ఉండాలని కోరుకుంటున్నాను. ప్రామాణిక న్యాయం, స్వేచ్ఛ నెలకొనే సమాజ నిర్మాణానికి మీ నిర్ణయాలు దోహదపడుతాయని ప్రార్థిస్తున్నా’’.
-పోప్ ఫ్రాన్సిస్
‘‘జర్మనీతో సబంధాల్లో నూతన అధ్యాయం కోసం ఎదురు చూస్తున్నా.’’
-జర్మనీ ఛాన్సలర్, ఏంజిలా మెర్కల్
‘‘మనం కలిసికట్టుగా ఉన్నాం. సవాళ్లను ఎదుర్కొనేందుకు బలంగా ఉన్నాం. మన భవిష్యత్తును నిర్మించుకునేందుకు, భూగోళాన్ని రక్షించేందుకు దృఢంగా ఉన్నాం. పారిస్ ఒప్పందంలోకి పునఃస్వాగతం.’’
-ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మెక్రాన్
‘‘కరోనాపై పోరాటం, ప్రజాస్వామ్యం పరిరక్షణ అన్నింట్లోనూ మన లక్ష్యాలు ఒక్కటే. వీటి సాధనకు కలిసి పనిచేద్దాం.’’
-బోరిస్ జాన్సన్, బ్రిటన్ అధ్యక్షుడు
‘‘ప్రెసిడెంట్ బైడెన్, మీకు, నాకు మధ్య దశాబ్దాలుగా సన్నిహిత స్నేహం ఉంది. అమెరికా-ఇజ్రాయెల్ సంబంధాలు పటిష్ఠతకు కలిసికట్టుగా పనిచేద్దాం.’’
-ఇజ్రాయెల్ ప్రధాని, బెంజిమన్ నెతన్యాహు
‘‘2015లో కుదిరిన అణు ఒప్పందంలో మళ్లీ చేరండి. ఈ ఒప్పందాన్ని పూర్తిగా గౌరవించి, కట్టుబడి ఉంటాం. నిరంకుశ పాలన ముగిసింది.’’
-ఇరాన్ అధ్యక్షుడు, హసన్ రౌహాని
‘‘స్వేచ్ఛాయుత, పారదర్శక ఇండో-పసిఫిక్ ప్రాంత సాధనకు కలిసికట్టుగా కృషి చేద్దాం.’’
-జపాన్ ప్రధాని, యోషిహిదే సుగా