‘డ్రాగన్ పవర్ కుట్ర’ నివేదిక నేపథ్యంలో విజ్ఞప్తి
వాషింగ్టన్: భారత్ పవర్‌గ్రిడ్‌పై చైనా సైబర్ దాడులకు పాల్పడిందన్న నివేదిక నేపథ్యంలో.. భారత్‌కు అమెరికా అండగా నిలవాలని యూఎస్ చట్టసభ్యుడు కోరారు. ‘అమెరికా తన వ్యూహాత్మక భాగస్వామి అయిన భారత్‌కు అండగా నిలవాలి. భారత్ విద్యుత్ గ్రిడ్‌లపై చైనా చేసిన సైబర్ దాడులను ఖండించాలి. ఈ దాడి వల్ల మహమ్మారి సమయంలో ఆసుపత్రుల్లో జనరేటర్లను వాడాల్సిన పరిస్థితి తలెత్తింది. బలవంతంగా, బెదిరింపుల ద్వారా చైనా ఆధిపత్యం చెలాయించడాన్ని అనుమతించం’ అని ఫ్రాంక్ పాల్లోన్ అనే చట్టసభ్యుడు ట్వీట్ చేశారు.
లద్దాఖ్ సరిహద్దులో ఘర్షణలు జరుగుతున్న సమయంలో, భారత్ విద్యుత్ గ్రిడ్‌లపై చైనా సైబర్ దాడులకు పాల్పడిందంటూ అమెరికా సంస్థ ‘రికార్డెడ్ ఫ్యూచర్’ సంచలన విషయాలను బయటపెట్టింది. గత అక్టోబర్‌లో ముంబయిలో పవర్ గ్రిడ్ విఫలం వెనక చైనా హస్తం ఉందని ఆ నివేదిక వెల్లడిస్తోంది. సరిహద్దు ఉద్రిక్తతల సమయంలో భారత్ పవర్ గ్రిడ్‌పై సైబర్ నేరగాళ్లు గురిపెట్టారని, భారత్ వెనక్కి తగ్గకపోతే దేశమంతా అంధకారంలోకి వెళ్తుందని ఓ సంకేతమివ్వడమే చైనా ఉద్దేశమని సదరు సంస్థ తెలిపింది. అయితే ఈ వాదనను చైనా ఖండించింది.