లాస్ ఏంజెల్స్: అమెరికాలో 36 ఏళ్ల ఓ భారత సంతతి వ్యక్తి.. కరోనా కమ్ముకొస్తున్న సమయంలో బయట ఉండాలంటే విపరీతంగా భయపడ్డాడు. మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు ఓ ఉపాయాన్ని ఆలోచించాడు. అంతర్జాతీయ విమానాశ్రయం ఐతే సురక్షితంగా ఉంటుందని అక్కడకి చేరాడు. ‘ది టెర్మినల్’ అనే అంగ్ల చిత్రంలో హీరో మాదిరిగా.. ఏకంగా మూడు నెలల పాటు ఎవరికీ దొరక్కుండా నెట్టుకొచ్చాడు. చివరికి అధికారుల చేతికి చిక్కాడు. ఈ కేసు వివరాలను అడిగి నిర్ధారించుకున్న న్యాయమూర్తి షాక్‌కు గురయ్యారు. అసలేమైందంటే..
ఆదిత్య సింగ్ అనే వ్యక్తి కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ నగర శివారు ప్రాంతంలో నివసిస్తున్నాడు. కొవిడ్ విజృంభిస్తుండటంతో భయాందోళనలకు గురయ్యాడు. అక్టోబర్ 19న లాస్ ఏంజెల్స్ నుంచి చికాగో అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఇక అక్కడి నుంచి బయటకు వెళ్లకుండా.. ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ జోన్‌లోనే రహస్యంగా ఉండిపోయాడు. ఎవరికీ పట్టుబడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ.. ప్రయాణికుల నుంచి సహాయం పొందుతూ కాలం గడిపాడు. కాగా, ఈ నెల 16న ఇద్దరు అధికారులు ధ్రువ పత్రాల గురించి సింగ్‌ను ప్రశ్నించటంతో.. ఒక బ్యాడ్జిని చూపించాడు. ఐతే అది విమానాశ్రయంలో పనిచేసే ఓ ఉద్యోగిదని.. అక్టోబర్ నుంచి కనిపించకుండా పోయిందని తెలిసింది. దీనితో వారు పోలీసులకు సమాచారమిచ్చారు.
నిషేధిత ప్రాంతంలో అనుమతి లేకుండా నేరపూరిత ఉద్దేశంతో నివసించినట్టు ఆదిత్య సింగ్‌పై న్యాయస్థానంలో పోలీసులు ఆరోపించారు. అయితే అతనికి నేర చరిత్ర లేదని.. విమానాశ్రయ సామగ్రికి కానీ.. ప్రయాణికులకు కానీ ఏ విధమైన హాని తలపెట్టలేదని చికాగో విమానయాన శాఖ అధికారులు స్పష్టం చేశారు. పీజీ అర్హత ఉన్నా నిరుద్యోగి అయిన ఇతను.. కరోనా భయంతో బయటకు వెళ్లలేక అక్కడే ఉండిపోయి ఉండొచ్చని న్యాయవాదులు వివరించారు. ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి ఈ వింత పరిస్థితి పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే విమానాశ్రయాల భద్రత విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన సూచిస్తోందని వెల్లడించారు. బెయిల్ కోసం వెయ్యి డాలర్లు చెల్లించాలని.. అంతవరకు విమానాశ్రయంలో అడుగుపెట్టరాదని ఆదిత్య సింగ్‌ను ఆదేశించిన న్యాయమూర్తి, కేసును జనవరి 27కు వాయిదా వేశారు.
ఇదీ చదవండి..