అమెరికా నిఘా నివేదిక వెల్లడి
వాషింగ్టన్: సంచలనం సృష్టించిన వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్టు జమాల్ ఖషోగీ హత్య ఘటనలో అగ్రరాజ్యం అమెరికా కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ హత్య వెనుక సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ హస్తం ఉందని గతంలో ఆరోపణలు వచ్చాయి. తాజాగా అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. ఈ మేరకు కాంగ్రెస్‌కు సమర్పించిన నివేదికలో పేర్కొంది.
టర్కీలోని ఇస్తాంబుల్‌లో గల సౌదీ అరేబియా దౌత్యకార్యాలయంలో 2018 అక్టోబరు 2న ఖషోగీ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. సౌదీ రాజకుటుంబాన్ని, అక్కడి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించే ఖషోగీ.. ఆ దేశ కాన్సులేట్‌లోనే హత్యకు గురవడంతో సౌదీ యువరాజుపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్(ఓడీఎన్‌ఐ) ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి కీలక ఆధారాలను సేకరించినట్లు సమాచారం.
‘‘సౌదీ రాజకుటుంబం తీసుకునే నిర్ణయాలపై యువరాజు నియంత్రణ ఉంటుంది. 2017 నుంచి రాజకుటుంబానికి చెందిన భధ్రత, నిఘా సంస్థలు పూర్తిగా యువరాజు అధీనంలోనే నడుస్తున్నాయి. అందువల్ల ఆయన అనుమతి లేకుండా సిబ్బంది ఇలాంటి ఆపరేషన్లు చేపట్టే అవకాశం లేదు. బహుశా ఖషోగీ హత్యకు యువరాజు సిబ్బందిని ప్రోత్సహించి ఉండొచ్చు. యువరాజు అప్పగించిన పని చేయకపోతే తమ ఉద్యోగాలు పోతాయి.. లేదా అరెస్టు చేస్తారని భయపడి సిబ్బంది హత్య చేసి ఉండొచ్చు. వీటన్నింటి ఆధారంగా ఖషోగీని బంధించడం లేదా హత్య చేసేందుకు ఇస్తాంబుల్ కాన్సులేట్‌లో చేపట్టిన ఆపరేషన్ మహ్మద్ బిన్ సల్మాన్ అనుమతితోనే జరిగిందని చెప్పొచ్చు’’ అని ఓడీఎన్‌ఐ నివేదిక పేర్కొంది.
సౌదీపై అమెరికా ఆంక్షలు..
ఈ నివేదికను కాంగ్రెస్‌లో సమర్పించిన తర్వాత సౌదీపై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశానికి చెందిన 76 మంది వ్యక్తులపై ‘ఖషోగీ బ్యాన్’ పేరుతో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వీసా ఆంక్షలు విధించారు. వారి కుటుంబసభ్యులకు కూడా ఈ ఆంక్షలు వర్తిస్తాయని తెలిపారు.