దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి నిరోధానికి అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు శ్రీకారం చుట్టారు. శనివారం ఉదయం 10.30 గంటలకు బృహత్తర టీకా పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. దేశ శాస్త్రవేత్తల కృషిని కొనియాడారు. వ్యాక్సిన్లతో భారత్ సత్తా ప్రపంచానికి తెలిసిందన్నారు.
‘కరోనా వ్యాక్సిన్ కోసం దేశమంతా ఎదురుచూసింది. టీకా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ అడిగారు. ఆ రోజు వచ్చేసింది. ఈ సందర్భంగా టీకా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేస్తున్నా. వ్యాక్సిన్ రూపకల్పనకు శాస్త్రవేత్తలు రేయింబవళ్లు కష్టపడ్డారు. వ్యాక్సిన్ల తయారీ కోసం ఎందరో అవిశ్రాంతంగా పనిచేశారు. సాధారణంగా టీకాల తయారీకి ఏళ్లు పడుతుంది. కానీ మన శాస్త్రవేత్తలు అతి తక్కువ సమయంలోనే అభివృద్ధి చేశారు. వారి కృషి ఫలితంగా నేడు ఒకటి కాదు రెండు స్వదేశీ టీకాలు అందుబాటులోకి వచ్చాయి. దేశీయ టీకా తయారీతో భారత్ సత్తా మరోసారి ప్రపంచానికి తెలిసింది’ అని మోదీ ప్రశంసించారు.
రెండో డోసును మర్చిపోవద్దు..
‘టీకా తీసుకోవడంలో వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులే తొలి హక్కుదారులు. కరోనాను ఎదుర్కొనేందుకు రెండు డోసులు తప్పనిసరిగా వేయించుకోవాలి. రెండు డోసులకు మధ్య నెల రోజుల వ్యవధి ఉండాలని నిపుణులు సూచించారు. అందువల్ల రెండో డోసును మర్చిపోవద్దు. అంతేగాక, తొలి డోసు వేసుకున్నాక కూడా మాస్క్‌లు,భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి. ఎందుకంటే రెండో డోసు వేసుకున్న తర్వాతే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది’ అని మోదీ వివరించారు.
ధైర్యంగా ఉండాలి..
కరోనాను ఎదుర్కొనేప్పుడు ఎలాంటి ధైర్యం ప్రదర్శించారో ఇప్పుడు కూడా అంతే ధైర్యాన్ని చూపాలని మోదీ అన్నారు. కరోనా మహమ్మారిపై యుద్ధం సమయంలో యావత్ భారతావని కుటుంబంలా మారిందని, సమైక్యతతోనే వైరస్‌ను ఎదుర్కోగలిగామని తెలిపారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో అతిపెద్ద టీకా పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టగలిగామన్నారు.
ప్రధాని నోట.. తెలుగు పలుకులు
ప్రసంగంలో భాగంగా మోదీ తెలుగులో మాట్లాడారు. ‘‘సొంతలాభం కొంత మానుకో. పొరుగువాడికి తోడుపడవోయ్. దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్’’ అంటూ తెలుగు మహాకవి గురజాడ అప్పారావు రాసిన దేశభక్తి గీతాన్ని వినిపించారు. గురజాడ మాటలను ఆచరిస్తూ కరోనా పోరులో దేశ ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చారని కొనియాడారు.
దేశవ్యాప్తంగా 3006 కేంద్రాల్లో 100 మందికి చొప్పున నేటి నుంచి వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైంది. తొలి రోజు 3 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు టీకా ఇవ్వనున్నారు. తొలి విడతలో 3 కోట్ల మందికి, రెండో విడతలో 30 కోట్ల మందికి టీకా ఇవ్వనున్నట్లు మోదీ తెలిపారు. తొలుత ఫ్రంట్‌లైన్ వర్కర్లు, ఆరోగ్య సిబ్బందికి ప్రాధాన్యమివ్వనున్నారు. ఆ తర్వాత 50ఏళ్ల పైబడిన, ఇతర అనారోగ్య సమస్యలున్న 50ఏళ్లలోపు వారికి టీకా అందిస్తారు.
ఇవీ చదవండి..