డబ్ల్యూహెచ్‌వో ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ ప్రశంస
దిల్లీ: అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా టీకాలు ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని, నూతన ఆవిష్కరణల సత్తాను భారత్ చాటిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ పేర్కొన్నారు. కరోనా కేసుల ఉద్ధృతి అకస్మాత్తుగా పెరిగిన నేపథ్యంలో ఆ మహమ్మారిపై పోరు ప్రస్తుతం చాలా కీలక దశకు చేరుకుందని ఇక్కడ జరిగిన ఒక సదస్సులో ఆమె తెలిపారు. ఐరోపా, అమెరికాలో కేసులు పెరుగుతున్నాయని వివరించారు. ప్రస్తుతం వైరస్ రకాలపై అనిశ్చితి నెలకొందన్నారు. టీకాల సామర్థ్యంపై అధ్యయనానికి అపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు. సమన్వయంతో వీటిని చేపట్టాలని కోరారు.
భారత్ ఇప్పటికే అనేక దేశాలకు టీకాలను సరఫరా చేయడం, మరిన్ని దేశాలు ఆర్డర్లు ఇవ్వడం వంటి అంశాల నేపథ్యంలో సౌమ్య ఈ వ్యాఖ్యలు చేశారు. నీతి ఆయోగ్ సభ్యుడు వినోద్ పాల్ మాట్లాడుతూ.. మహమ్మారి విజృంభణ సమయంలో శాస్త్ర సమాజం శరవేగంగా పనిచేసి, అనేక పరిష్కార మార్గాలను కనుగొందని కొనియాడారు. టీకాల రూపకల్పన ఇందుకు ఉదాహరణ అని చెప్పారు.
మహమ్మారి అంతం ఇప్పట్లో కాదు: డబ్ల్యూహెచ్‌వో
జెనీవా: ఈ ఏడాది చివర్లోగా కరోనా మహమ్మారి అంతమవుతుందన్న విశ్లేషణలను డబ్ల్యూహెచ్‌వోలో అత్యవసర పరిస్థితుల విభాగం డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ ఖండించారు. అవన్నీ తొందరపాటుతో కూడిన అవాస్తవిక అంచనాలని తెలిపారు. అయితే ఇటీవల సమర్థ టీకాలు వచ్చిన నేపథ్యంలో కొవిడ్-19తో ఆసుపత్రిపాలు కావడం, మరణించడం వంటివాటిని గణనీయంగా తగ్గించొచ్చని పేర్కొన్నారు. వ్యాధి వ్యాప్తిని సాధ్యమైనంత మేర కట్టడి చేయడమే ప్రపంచం ముందు నేడున్న అతిపెద్ద సవాల్ అని తెలిపారు. వ్యాక్సిన్లు ఆ దిశగా ఉపయోగపడుతున్నట్లు గట్టి ఆధారాలు ఉన్నాయన్నారు. అయితే అలసత్వానికి తావివ్వకూడదని, మహమ్మారి తీరుతెన్నులు ఎప్పటికప్పుడు మారుతున్నాయని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో దేనికీ పూచీకత్తు ఉండదన్నారు.
ఇదేం తీరు?: టెడ్రోస్
కొన్ని దేశాల్లో వ్యాక్సిన్ల పంపిణీ తీరుపై డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రెయెసస్ ఆందోళన వ్యక్తంచేశారు. వర్ధమాన దేశాల్లో.. ముప్పు ఎక్కువగా ఉన్న ఆరోగ్య కార్యకర్తలకు టీకాలు ఇవ్వడానికి ముందే ధనిక దేశాల్లో ఆరోగ్యవంతులైన యువతకు వ్యాక్సిన్లు వేస్తున్నారన్నారు. ఐరాస ఆధ్వర్యంలోని ‘కోవాక్స్’ కింద వచ్చే వారం ఘనా, ఐవరీ కోస్టు దేశాల్లో టీకాలు వేస్తామన్నారు. అయితే బ్రిటన్, అమెరికా, కెనడా వంటి దేశాలు తమ ప్రజలకు టీకాలు వేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టిన మూడు నెలల తర్వాత కానీ ఇది సాధ్యం కావడంలేదని ఆక్షేపించారు. ‘‘దేశాలు పరస్పరం పోటీ పడకూడదు. ఇది వైరస్‌పై సాగించే ఉమ్మడి పోరు. మీ ప్రజలను ఇబ్బందుల్లో పెట్టాలని మేం చెప్పడంలేదు. వైరస్ ఎక్కడున్నా అణచివేసే అంతర్జాతీయ కసరత్తులో భాగస్వామ్యం వహించాలని మాత్రమే కోరుతున్నాం’’ అని పేర్కొన్నారు.