జెనీవా: సరిహద్దుల్లో ఉగ్రవాద చర్యలకు ముగింపు పలకాలని పాకిస్థాన్‌ను భారత్ హెచ్చరించింది. జెనీవాలో జరిగిన ఐరాస 46వ మానవ హక్కుల మండలిలో భారత దౌత్యవేత్త పవన్‌కుమార్ ఉగ్రవాదంపై పాక్ వైఖరిని ఎండగట్టారు. తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్ ఇకనైనా ఉగ్రవాద చర్యలకు వత్తాసు పలకడం మానుకోవాలని సూచించారు. ఉగ్రవాదులకు పాక్ ప్రభుత్వం నిధులు సమకూర్చిన విషయం అందరికీ తెలుసన్న భారత్.. అతిపెద్ద ఉగ్ర ముఠాలకు పాక్ ఆశ్రయం ఇస్తున్నట్లు ఐరాస కూడా గుర్తించిందని దాయాది దేశం జిత్తులమారి వేషాలను ఎత్తిచూపింది. పాక్ ఉగ్రవాద స్థావరంగా మారిందని ఆ దేశ నేతలే అంగీకరించిన విషయాన్ని ఈ సందర్భంగా భారత్ గుర్తుచేసింది.
పాకిస్థాన్‌లోని మైనారిటీలపై జరుగుతున్న దాడుల గురించి ఆ దేశాన్ని మానవ హక్కుల మండలి ప్రశ్నించాలని భారత్ సూచించింది. కశ్మీర్ గురించి ప్రశ్నించే హక్కు పాక్‌కు లేదని దౌత్యవేత్త పవన్‌కుమార్ దాయాది దేశానికి స్పష్టం చేశారు.