న్యూయార్క్: కొవిషీల్డ్ వ్యాక్సిన్ తయారు చేస్తోన్న సీరం ఇనిస్టిట్యూట్‌లో చోటుచేసుకున్న అగ్నిప్రమాద ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఐక్యరాజ్యసమితి తీవ్ర విచారం వ్యక్తం చేసింది. పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు మృతి చెందడం తీవ్ర విచారకరమని.. ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ పేర్కొన్నారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతుందని ఐరాస చీఫ్ ఆశాభావం వ్యక్తం చేసినట్లు సెక్రటరీ జనరల్ అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ వెల్లడించారు.
ఇక, పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్‌కి చెందిన మంజరీ కేంద్రంలో గురువారం జరిగిన అగ్నిప్రమాదంతో వ్యాక్సిన్ ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం ఉండదని సంస్థ సీఈఓ అదర్ పూనావాలా ఇప్పటికే స్పష్టం చేశారు. ఇలాంటి ఆకస్మిక పరిస్థితుల్లోనూ వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు అదే ప్రాంగణంలో ఇతర భవనాలు సిద్ధంగా ఉన్నాయని పూనావాలా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, సీరంలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదానికి అక్కడ జరుగుతోన్న వెల్డింగ్ పనులే కారణమని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చింది. అయినప్పటికీ దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతున్నట్లు స్పష్టంచేసింది.
ఇవీ చదవండి..
సీరం సంస్థలో భారీ అగ్ని ప్రమాదం
సీరం అగ్నిప్రమాదంలో ఐదుగురు మృతి