దిల్లీ: వ్యవసాయ చట్టాలు విషయంలో కేంద్ర ప్రభుత్వం రైతులతో జరుపుతున్న సంప్రదింపుల్లో భాగంగా పదకొండో విడత చర్చలు శుక్రవారం దిల్లీలో ప్రారంభమయ్యాయి. రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్ దిల్లీ విజ్ఞాన్ భవన్‌లో సమావేశమయ్యారు.
వ్యవసాయ చట్టాలను ఏడాదిన్నరపాటు తాత్కాలికంగా నిలుపుదల చేస్తామని, వీటిపై సంయుక్త కమిటీ వేసి చర్చించేందుకు సిద్ధమని ఇప్పటికే కేంద్రం ప్రతిపాదించింది. దీనిపై దిల్లీ సరిహద్దులోని సింఘూ వద్ద గురువారం సమావేళమైన రైతు సంఘాల సమన్వయ కమిటీ.. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను తీరస్కరిస్తూ తీర్మానం చేసింది. మూడు వ్యవసాయ చట్టాల రద్దు తప్ప ఏదీ సమ్మతం కాదని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. అంతేకాకుండా తమ డిమాండ్‌ను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని.. చట్టాలను రద్దు చేయాల్సిందేనని స్పష్టంచేస్తున్నాయి. ఇదే నిర్ణయాన్ని ప్రభుత్వంతో ఇవాళ జరుగుతున్న సమావేశంలో రైతు సంఘాల ప్రతినిధులు తెలిపే అవకాశం ఉంది.
మరోవైపు సాగు చట్టాల అమలుపై రైతులతో చర్చించేందుకు సుప్రీం కోర్టు నియమించిన నిపుణుల కమిటీ సంప్రదింపులు ప్రారంభించింది. నిన్న ఎనిమిది రాష్ట్రాల్లోని దాదాపు పది రైతు సంఘాలతో చర్చలు జరిపి వారి అభిప్రాయాలు, సూచనలను తీసుకుంది. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి..
రైతుల ఆందోళన..రూ.50వేల కోట్ల నష్టం
సాగు చట్టాలను తాత్కాలికంగా నిలిపేస్తాం!