ఉర్రూతలూగించనున్న లేడీ గాగా, లోపెజ్
వాషింగ్టన్: అమెరికా తదుపరి అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా డెమొక్రాట్ నేతలు జో బైడెన్, కమలా హారిస్‌లు ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసే కార్యక్రమాల్లో ప్రఖ్యాత కళాకారులు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. ప్రముఖ గాయని లేడీ గాగా జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. మరో గాయని, నృత్యకారిణి, నటి జెన్నిఫర్ లోపెజ్ సంగీత కచేరీ కూడా ఉంటుంది. కొవిడ్-19 నిబంధనల నేపథ్యంలో... వీటిలో చాలా కార్యక్రమాలు వర్చ్యువల్ విధానంలోనే ఉంటాయని అధికార వర్గాలు తెలిపాయి.
భారత సంతతి వ్యక్తులకు కీలక పదవులు...
సైనిక కుటుంబాల కోసం ఉద్దేశించిన ‘జాయినింగ్ ఫోర్సెస్’ కార్యక్రమ కార్యనిర్వాహక అధికారిగా... జో సీనియర్ సలహాదారు రోరీ బ్రోసియస్ పేరును బైడెన్, జిల్ దంపతులు ప్రకటించారు. ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (ఫెమా) అడ్మినిస్ట్రేటర్‌గా న్యూయార్క్ ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్ కమిషనర్ డియన్నె క్రిస్‌వెల్‌ను నామినేట్ చేశారు. తదుపరి ప్రథమ మహిళ డిజిటల్ విభాగ డైరెక్టర్‌గా భారత సంతతి అమెరికన్ గరిమా వర్మ, మీడియా కార్యదర్శిగా మైఖేల్ లారోసా పేర్లను నామినేట్ చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్-హారిస్ ప్రచార కార్యక్రమాలకు గరిమా జన సమీకరణ వ్యూహాలు రచించారు. బైడెన్ కార్యనిర్వాహక వర్గంలో ప్రధానమైన ‘నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్’ డిప్యూటీ డైరెక్టరుగా కశ్మీర్ మహిళ సమీరా ఫాజిల్‌ను బైడెన్ ఎంపిక చేశారు.దేశంలో తయారీ, ఆవిష్కరణలు వంటి అంశాలను ఆమె పర్యవేక్షిస్తారు.కాగా, కాంగ్రెస్ భవనం క్యాపిటల్ హిల్‌పై దాడికి పాల్పడినవారిలో అంతర్యుద్ధ జెండా (కాన్ఫెడరేట్ ఫ్లాగ్)ను చేతబూనిన కెవిన్ సీఫ్రెండ్, అతని కుమారుడిని అరెస్టు చేసినట్టు ఎఫ్‌బీఐ వర్గాలు వెల్లడించాయి.
అఫ్గాన్ నుంచి మరిన్ని దళాల ఉపసంహరణ
అఫ్గానిస్థాన్‌లో నుంచి తాజాగా మరిన్ని బలగాలను అమెరికా ఉపసంహరించుకుంది. శుక్రవారం నాటికి అక్కడ కేవలం 2,500 ట్రూపుల బలగాలు మాత్రమే ఉన్నాయి. గత 19 ఏళ్లలో ఇంత తక్కువ సంఖ్యలో అమెరికా బలగాలు అఫ్గాన్‌లో ఉండటం ఇదే తొలిసారి అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఏడాది మే నాటికి అఫ్గాన్ నుంచి అమెరికా దళాలను పూర్తిగా ఉపసంహరించుకునేందుకు గత ఫిబ్రవరిలో తాలిబన్‌లతో ట్రంప్ సర్కారు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే, బైడెన్ దీనిపై ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాల్సిందే!
ఇవీ చదవండి..
అందుకే చైనాపై మా అనుమానాలు: పాంపియో