వందతులు నమ్మెద్దు.. నిపుణుల మాట వినండి
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి సూచన
దిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం భారత్‌లో ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో టీకాలపై వచ్చే ఎటువంటి వదంతులను నమ్మవద్దని.. అవి కరోనా మహమ్మారి పోరులో సంజీవని వంటివని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ స్పష్టంచేశారు. కేవలం శాస్త్రవేత్తలు, నిపుణుల మాటలనే నమ్మాలని దిల్లీ ఎయిమ్స్‌లో జరిగిన వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ద్వారా కేంద్రమంత్రి హర్షవర్ధన్ దేశప్రజలకు సూచించారు.
‘ఇది చరిత్రాత్మకమైన రోజు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం దేశంలో ప్రారంభమైంది. దీంతో గత సంవత్సరంగా మహమ్మారిపై చేస్తోన్న పోరాటానికి ముగింపు పలికే సమయం ఆసన్నమైంది. ఇప్పటివరకు తీసుకున్న గట్టి చర్యల ద్వారా వైరస్ వ్యాప్తిని సాధ్యమైనంత వరకు కట్టడిచేయగలిగాం. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న చర్యలు అభినందనీయం’ అని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ పోరులో ముందున్న వైద్యులు, నర్సులు, ఆరోగ్యసిబ్బంది, పోలీసులు, జర్నలిస్టులతో సహా ఇతర సిబ్బందికి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం ప్రారంభించారు. ఇందులో భాగంగా మొదటి రోజు దేశవ్యాప్తంగా దాదాపు 3లక్షల మందికి వ్యాక్సిన్ అందించేందుకు ఏర్పాట్లు చేశారు. తొలి దశలో మూడుకోట్ల మందికి, రెండో దశలో దాదాపు 30కోట్ల మందికి టీకా అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.
ఇవీ చదవండి..
కన్నీటి పర్యంతమైన మోదీ
‘పేషెంట్ జీరో’ను ఎప్పటికీ కనుక్కోలేము..!