ముంబయి: గత రెండు వారాలుగా మహారాష్ట్రలోని 28 జిల్లాల్లో కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉన్నట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. విదర్భ, అమరావతి, అకోలా, యావత్మాల్ జిల్లాల్లో హాట్‌స్పాట్లను గుర్తించినట్లు వారు తెలిపారు. గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇందులో మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల కేసులే ఎక్కువ శాతం ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఫిబ్రవరిలో పెరిగిన కేసులు ముఖ్యంగా విదర్భ, నాగ్‌పూర్, పుణె, ముంబయి, థానే, అమరావతి ప్రాంతాల్లోనే నమోదయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఐదు జిల్లాలు రాష్ట్రంలోని మొత్తం కేసుల్లో 65శాతం ఉన్నట్లు వారు వెల్లడించారు. అత్యధికంగా అమరావతిలో పాజిటివిటీ రేటు 41.5 శాతంగా ఉందని పేర్కొన్నారు. ఆయా జిల్లాల్లో రోజుకు సుమారు 500 నుంచి వెయ్యి కేసులు నమోదవుతున్నట్లు వారు వెల్లడించారు. ఈ మేరకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ గణాంకాలు విడుదల చేసింది. మారత్వాడ, ఔరంగాబాద్ ప్రాంతాలకు చెందిన జిల్లాల్లో కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా టెస్టుల సంఖ్య భారీగా పెంచాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
కాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 16,488 కొత్త కేసులు నమోదయ్యాయి. కేసులు ఎక్కువగా పెరుగుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర (8,333) మొదటిస్థానంలో ఉండగా, కేరళ (3,671) రెండో స్థానంలో ఉంది. గత రెండు వారాలుగా కేసుల పెరుగుదలలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా, క్రియాశీల కేసుల సంఖ్య తగ్గుతున్న రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానంలో ఉంది. పెరుగుతున్న కేసుల దృష్ట్యా మహారాష్ట్రలో కొవిడ్ నిబంధనలు కఠినం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించిన మూడు ఫంక్షన్ హాళ్లపై ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.