ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోండి
భారత ప్రధాన న్యాయమూర్తికి బృందా కారాట్ అభ్యర్థన
దిల్లీ: అత్యాచార కేసులో బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలంటూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బోబ్డేకు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారాట్ లేఖ రాశారు. ఓ బాలికపై పలుమార్లు అత్యాచారం చేసిన కేసులో ప్రభుత్వ ఉద్యోగి అయిన నిందితుడికి కింది కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే, దాన్ని బాంబే హైకోర్టు కొట్టేసింది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో... ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా- ‘‘బాధితురాలిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమేనా? అలాగైతే బెయిల్ మంజూరును పరిగణనలోకి తీసుకుంటాం. లేదంటే జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. పెళ్లి చేసుకోవాలని మాత్రం మేమేమీ బలవంతం చేయడం లేదు’’ అని నిందితుడిని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. అరెస్టు నుంచి నాలుగు వారాల పాటు అతడికి మినహాయింపు ఇచ్చింది. ఈ వ్యాఖ్యల క్రమంలో ప్రధాన న్యాయమూర్తికి కారాట్ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘‘16 ఏళ్ల బాలికపై 10-12 సార్లు అత్యాచారం చేసిన వ్యక్తిని ఉద్దేశించి... ఆమెను పెళ్లి చేసుకుంటావా? అని ప్రశ్నించడం సమాజానికి తప్పుడు సందేశం ఇస్తోంది. ఇలాంటి వ్యాఖ్యల ప్రభావం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మహిళలపై అత్యాచారం చేసి, ఆపై వారిని పెళ్లి చేసుకోవడం ద్వారా రేపిస్టులు జైలు శిక్ష నుంచి తప్పించుకునే ప్రమాదముంది. దయచేసి విచారణ సందర్భంగా చేసిన తిరోగమన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి’’ అని కారాట్ అభ్యర్థించారు.