గుజరాత్ వాసులకు కేజ్రీవాల్ కృతజ్ఞతలు
అహ్మదాబాద్: మొదటి ప్రయత్నంలోనే గుజరాత్‌లోని సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) 27 స్థానాలు గెలుచుకొని సత్తా చాటింది. తమ పార్టీని ఆదరించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం సూరత్‌లో రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ..‘మాకు 27 సీట్లు దక్కితే..వారికి 93 స్థానాలు వచ్చాయి. ఈ సంఖ్య పెద్ద విషయం కాదు. మా పార్టీలో ప్రతి ఒక్కరు..పది మంది ప్రత్యర్థులకు సరితూగగలరు. సూరత్ ప్రజలు మాకు ప్రతిపక్ష పాత్రను కట్టబెట్టారు. మా ప్రత్యర్థులను ఏ తప్పు చేయనివ్వం. ప్రజలు దేన్నైనా సహిస్తారు కానీ..అహంకారం, అవమానాన్ని సహించరు. సహాయం కోసం మన చెంతకు వచ్చేవారిని ఎప్పటికీ అవమానించకూడదు’ అంటూ ఆ రోడ్‌షోలో కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. పరోక్షంగా భాజపా వైఖరిని ఎండగట్టారు.
ఇటీవల ముగిసిన గుజరాత్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాజపా క్లీన్‌స్వీప్ చేసింది. అన్ని కార్పొరేషన్లలో భారీ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగిన ఆప్ బోణీ కొట్టింది. సూరత్ కార్పొరేషన్లో 27 డివిజన్లు గెలుచుకొని పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపింది. మరోవైపు, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కేవలం 45 సీట్లకే పరిమితమైపోయింది.