ఎన్డీఆర్‌ఎఫ్ డీజీ ఎస్ఎన్ ప్రధాన్ వెల్లడి
దిల్లీ: నివర్ తుపాను తమిళనాడు, పుదుచ్చేరిలను వణికిస్తోంది. ఈ తుపాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాల్లో లక్ష మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు ఎన్డీఆర్‌ఎఫ్ డీజీ ఎస్ఎన్ ప్రధాన్ వెల్లడించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం 50 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు కేటాయించినట్టు చెప్పారు. వీటిలో 30 బృందాలను తమిళనాడు, ఏపీతో పాటు పుదుచ్చేరిలో మోహరించామన్నారు.
పరిస్థితులను బట్టి అవసరమైతే రంగంలోకి దించేందుకు మరో 20 బృందాలను విజయవాడ, కటక్, త్రిస్సూర్‌లలో సిద్ధంగా ఉంచినట్టు ఎస్‌ఎన్ ప్రధాన్ తెలిపారు. ‘నివర్’తో ఎదురయ్యే ఎలాంటి సవాల్‌నైనా ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేసినట్టు చెప్పారు. ఇప్పటివరకు తమకు అందిన సమాచారం ప్రకారం గురువారం తెల్లవారు జామున 2 -3గంటల మధ్య నివర్ తుపాను కరైకల్- మామల్లాపురం మధ్య తీరం దాటనుందని స్పష్టంచేశారు. ఆ సమయంలో గంటకు 130 నుంచి 145 కి.మీల మేర గాలులు వీస్తాయని హెచ్చరించారు. ఇప్పటివరకు తమిళనాడు వ్యాప్తంగా లక్ష మందికి పైగా జనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించగా.. పుదుచ్చేరిలో వెయ్యి నుంచి 2వేల మందిని స్థానిక అధికారులతో కలిసి ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది తరలించారని తెలిపారు.