నూతన గరిష్ఠానికి కరోనా కొత్త కేసులు
630 మంది మృతి
ఈనాడు, దిల్లీ: దేశంలో కరోనా కేసుల కొండ రోజురోజుకు మరింతగా పెరిగిపోతోంది. కొత్త కేసుల సంఖ్యలో తాజాగా నూతన గరిష్ఠం నమోదైంది. గతంలో ఎన్నడూ లేనంతగా.. గంటకు 4,822 చొప్పున ఒక్క రోజులో 1,15,736 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,28,01,785కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్, గుజరాత్‌లలోనూ గతంలో ఎన్నడూ లేనిస్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. 18 రాష్ట్రాల్లో గత రెండు వారాలను మించి వచ్చాయి. తాజాగా ఒక్క రోజు వ్యవధిలో 630 మంది కొవిడ్-19 కారణంగా మరణించారు. నవంబర్ 6 తర్వాత ఇంత భారీ సంఖ్యలో బాధితులు చనిపోవడం ఇదే ప్రథమం. నాలుగు రోజులుగా ప్రపంచంలో ఏ దేశంలో లేనన్ని కొత్త కేసులు భారత్‌లో నమోదవుతున్నాయి. మొత్తంగా 12 రాష్ట్రాల్లో కేసులు పురోగమనంలో సాగుతున్నాయి. 80%కిపైగా కొత్త కేసులు 8 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఒక్క మహారాష్ట్రలోనే 55,469 (47.92%) కేసులు రాగా, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్, దిల్లీ, మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళల్లో 32.68%మేర నమోదయ్యాయి. నెల రోజుల క్రితం 2.29%మేర ఉన్న రోజువారీ పాజిటివిటీ రేటు ఇప్పుడు 8.40%కి పెరిగింది. క్రియాశీల కేసుల సంఖ్య 8,43,473కు చేరింది. మొత్తం పాజిటివ్ కేసుల్లో ఇది 6.59%.
* గత 24 గంటల్లో 55,250 మేర పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. ఇందులో 74.5% మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ, ఉత్తర్‌ప్రదేశ్‌లలోనే ఉన్నాయి. అందులోనూ ఒక్క మహారాష్ట్ర వాటా 56.17%మేర ఉంది.
* తాజాగా నమోదైన 630 మరణాల్లో 297 (47.14%) మహారాష్ట్ర నుంచే వచ్చాయి. పంజాబ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌లలోనూ గతంతో పోల్చితే మరణాలు పెరిగాయి. తాజా లెక్కల ప్రకారం మొత్తం మరణాల సంఖ్య 1,66,177కు చేరగా, మరణాల రేటు 1.30%కి చేరింది.
* ఈ నెల 6వ తేదీ వరకు 25,14,39,598 నమూనాలను పరీక్షించామని, ఒక్క మంగళవారమే 12,08,339 పరీక్షలు చేశామని భారత వైద్య పరిశోధన మండలి బుధవారం ప్రకటించింది.