మాయ మాటలతో వ్యాపారికి రూ.11 కోట్ల టోకరా
ఈనాడు, హైదరాబాద్/న్యూస్‌టుడే, నిజాంపేట: ఎన్నెన్నో మాయమాటలు.. రూ.11 కోట్ల మోసం.. ఇలాంటి సంఘటనలను సినిమాల్లోనే చూస్తుంటాం. అయ్యో.. ఇలా కూడా మోసపోయే వాళ్లుంటారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటాం. ఐపీఎస్‌కు ఎంపికయ్యానంటూ అతడు.. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం ఛైర్‌పర్సన్‌ను అంటూ ఆమె అధికార దర్పంతో అందంగా అబద్ధమాడి ఓ వ్యాపారికి కుచ్చు టోపీ పెట్టారు. చేబదులంటూ కోట్లు కాజేశారు. ఖరీదైన కార్లలో షికారు చేశారు. విలువైన స్థలాలు కొనుగోలు చేసి.. విలాసాలతో తులతూగారు. చివరకు.. మోసం బయటపడటంతో ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాచుపల్లి పోలీసులు చాకచాక్యంగా వ్యవహరించి ప్రియురాలు సహా మరో నలుగురు కేటుగాళ్ల ఆట కట్టించారు. ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలను బుధవారం మాదాపూర్ ఇన్‌ఛార్జి డీసీపీ ఎం.వెంకటేశ్వర్లు మీడియాకు వెల్లడించారు.
శిరీష చదివింది పదోతరగతి..
కడప పట్టణానికి చెందిన ఉద్దానం శిరీష(39) పదో తరగతి చదివింది. బాల్య వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భర్త ఉపాధి కోసం కువైట్ వెళ్లాడు. పదేళ్ల కిందట ఆయనతో విడిపోయింది. సినిమాల్లో నటించాలనే ఆసక్తితో నగరానికొచ్చింది. స్మృతి సింహగా పేరు మార్చుకొని నటనలో శిక్షణ తీసుకొంది. సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో బోరబండలో సింహ సూపర్ మార్కెట్‌ను ప్రారంభించింది. వ్యాపార లావాదేవీల్లో సాఫ్ట్‌వేర్ నిపుణుడు, అవివాహితుడైన అంకిరెడ్డి విజయ్‌కుమార్‌రెడ్డి(41) పరిచయమయ్యాడు. ఇద్దరూ సహజీవనం చేశారు. వ్యాపారంలో నష్టాలు రావడంతో 2017 డిసెంబరులో బాచుపల్లిలోని ప్రణవ్ అంటిల్లాలోని విల్లాకు మకాం మార్చారు. పక్క విల్లాలో ఉండే క్రషర్ యజమాని పి.వీరారెడ్డి పరిచయం అయ్యాడు. డెహ్రాడూన్‌లో ఐపీఎస్ శిక్షణ పొందుతున్నానని, శిక్షణలో ఏర్పడిన గాయాల కారణంగా తాత్కాలికంగా ఇక్కడికి వచ్చానంటూ విజయ్‌కుమార్‌రెడ్డి పరిచయం చేసుకున్నాడు. 72 ట్రావెల్స్ బస్సులకు యజమానినని నమ్మించాడు. తన భార్య అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఛైర్‌పర్సన్ అని చెప్పాడు. సైరన్‌తో ఖరీదైన కార్లలో తిరుగుతుండటంతో బాధితుడు నిజమేనని భావించి వారితో మరింత సన్నిహితంగా మెలిగాడు.
చెల్లెలితో పెళ్లి చేయిస్తానంటూ...
విజయ్‌కుమార్‌రెడ్డి.. తండ్రి రాఘవరెడ్డిని సెంట్రల్ జోన్ డీసీపీగా వీరారెడ్డికి పరిచయం చేశాడు. విజయ్‌కుమార్ సమీప బంధువులు రణధీర్‌రెడ్డి, అభిలాష్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి కూడా జత కలిశారు. వీరంతా ముఠాగా ఏర్పడి వివిధ కారణాలు చెప్పి చేబదులుగా వీరారెడ్డి నుంచి రూ.11 కోట్లు తీసుకున్నారు. బాధితుడి సోదరుడికి సంబంధాలు చూస్తున్నారని తెలుసుకొని స్మృతి సింహ మరో అడుగు ముందుకేసింది. తన సోదరినిచ్చి వివాహం చేస్తానంటూ నమ్మించింది. వేరే యువతి ఫొటోలను పంపించి, గొంతు మార్చి తానే బాధితుడి సోదరుడితో తరచూ మాట్లాడేది. వీరారెడ్డి తిరిగి డబ్బులివ్వమని అడిగితే కాబోయే బంధువులమే కదా అంటూ కాలయాపన చేస్తూ వచ్చారు. ఆయనకు అనుమానమొచ్చి ఆరా తీయగా ఈ కేటుగాళ్ల మోసం బయటపడింది. అప్పటి నుంచి డబ్బు చెల్లించాలంటూ విజయ్‌కుమార్‌పై ఒత్తిడి తెచ్చాడు. బండారం బయటపడటంతో ఆందోళనకు గురైన విజయ్ కుమార్ ఈ నెల 5న ప్రగతినగర్‌లోని ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకొనే ముందు వీరారెడ్డిని మోసం చేసినట్లు సెల్ఫీ వీడియో తీసుకొని అందరికీ పంపించాడు. ఈ ఘటనతో అసలు విషయం వెలుగు చూసింది. ఆ మరుసటి రోజే వీరారెడ్డి ఫిర్యాదు చేయడంతో బాచుపల్లి పోలీసులు రంగంలోకి దిగారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి ఖరీదైన 5 కార్లు(3 బీఎండబ్ల్యూ, 2 ఫోర్డు), రూ.50 లక్షల విలువైన బంగారు, వజ్రాల ఆభరణాలు, రూ.2 లక్షల నగదు, వివిధ బ్యాంకులకు చెందిన 46 క్రెడిట్ కార్డులు, 7 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అభిలాష్‌రెడ్డి పరారీలో ఉన్నాడు.