Published : 18/03/2021 00:19 IST
రాఘవేంద్రుడి రాముడెవరు?

ఈ నెల 20 గురు రాఘవేంద్రుల జన్మదినం

ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః...
రాఘవేంద్ర స్వామి కలియుగ కల్పవృక్షం. బృందావనంలో ఇప్పటికీ ఆయన సజీవుడిగా ఉన్నారని, తమ మొర ఆలకిస్తున్నారని భక్తులు నమ్ముతారు. ఎందరో ఆ యోగిరాజును స్మరిస్తూ తరిస్తున్నారు. ఆయన మహిమ అనంతం. రాఘవేంద్రులకు అంతటి శక్తి ఆయన నిత్యం కోరికొలిచిన మూల రాముడి వల్ల వచ్చిందని చెబుతారు. ఈ ప్రతిమ మనకు తెలిసిన దశరథ కుమారుడు శ్రీరామచంద్రుడిది కాదు. వేదాల్లో వర్ణించిన రూపంగా చెబుతారు. విశ్వకర్మ తీర్చిదిద్దిన ఈ అద్భుత ‘రాముణ్ణి’ చతర్ముఖ బ్రహ్మ పూజించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇంతకీ ఏమిటీ మూల మూర్తి కథ?
మూల రామ స్వరూపం గురించి వాసిష్ఠ రామాయణం, అధ్యాత్మ రామాయణం, మార్కండేయ పురాణాల్లో కనిపిస్తుంది. ఆ ప్రతిమను రూపొందించింది విశ్వకర్మ. చాలా కాలం పాటు తాను ఆరాధించిన తర్వాత ఈ మూర్తిని లోక క్షేమం కోసం జాబాలి మహర్షికి ఇచ్చాడు బ్రహ్మ. జాబాలి నుంచి ఎంతో మంది మహోన్నత రుషుల వద్దకు... ఆ పరంపరలో ఇక్ష్వాకు చక్రవర్తి వద్దకు ఆ మూర్తి చేరింది. అతడీ ప్రతిమను తమ ఇలవేల్పుగా ఆరాధించి తరించాడు. ఇక్ష్వాకు వంశంలోని మాంధాత, అనరణ్యుడు, త్రిశంకుడు, హరిశ్చంద్రుడు, భగీరథుడు, అంబరీషుడు, దిలీపుడు… వంటి మహా చక్రవర్తులందరూ  మూల రాముణ్ణి భక్తితో కొలిచి ధన్యులయ్యారు. దశరథ మహారాజు తనకు పుత్రుడు పుట్టగానే రామచంద్ర అని నామకరణం చేశాడు. రాములిద్దరు అయినందువల్ల ఆనాటి నుంచి రామ ప్రతిమకు ‘మూల రామ’ అనే పేరు వచ్చింది. దశరథుడి కుమారుడైన శ్రీరాముడుకూడా ఆ ప్రతిమను ఆరాధించాడు. ఇంతటి విశిష్ఠ రూపం కలియుగంలో రాఘవేంద్రుడి పూజలందుకోవడం వెనక ఆసక్తికరమైన కథను చెబుతారు. ఇది ఆ పావన మూర్తి అవతార రహస్యంతో ముడిపడి ఉంది.
స్థలపురాణం ప్రకారం కృతయుగంలో బ్రహ్మదేవుడి సేవకుడిగా ఉన్న శంఖుకర్ణుడే రాఘవేంద్రస్వామిగా అవతరించాడు. బ్రహ్మ దేవతార్చన చేయడానికి కావాల్సిన ఏర్పాట్లను శంఖుకర్ణుడు చేస్తుండేవాడు. పూలు, తులసి వంటివి సమకూర్చేవాడు. బ్రహ్మ అర్చించే దివ్య మంగళ రూపం మూల రాముడిది. వేదాలు కీర్తించిన ఆ ప్రతిమను చూసి తన్మయుడవుతుండేవాడాయన. తనకూ మూల రాముడి పూజా భాగ్యం కలగాలని నిరంతరం కోరుకునేవాడు. ఓ రోజు పూజకు పూలు, పత్రాలు తీసుకురావడం ఆలస్యమవడంతో బ్రహ్మ శంఖుకర్ణుడిని భూలోకంలో జన్మించమని శపించాడు. దీంతో భూలోకంలో మొదట ప్రహ్లాదుడిగా, ద్వాపరయుగంలో బాహ్లికుడు అనే రాజుగా, తరవాత వ్యాసరాయలుగా చివరకు రాఘవేంద్రుడిగా జన్మించారు. తాను చూసిన దివ్య మంగళ రూపంపై తదేక చింతన వల్ల ఆ జన్మలన్నిట్లో మూలరామ రూపాన్ని  పూజించే భాగ్యం శంఖుకర్ణుడికి దక్కింది. అలా రాఘవేంద్రులు ఆ మూల మూర్తి ఆరాధనలో నిమగ్నమయ్యారు. ఇప్పుడు కూడా మంత్రాలయ మఠంలో ఆ విగ్రహాలను చూడొచ్చు. 

పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయచ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే

... ఒకటే ప్రార్థన!

అది రాఘవేంద్రుల పూజాగృహం... మూల రాముని సన్నిధిలో గురుదేవులు భగవదారాధనలో ఉన్నారు.
ఇంతలో ఓ శిష్యుడు వారి వద్దకు వచ్చి ‘స్వామీ! ఆదోని నవాబు సిద్ధీ మసూద్‌ఖాన్‌ మీ దర్శనం కోరుతున్నారు. మీరు తమ దర్బారుకు రావాలని అడుగుతున్నారు.’ అని మెల్లగా చెవిలో చెప్పాడు.
‘రాముని కృప అందరిపై సమంగానే వర్షిస్తుంది. తప్పకుండా వస్తున్నా’మని చెప్పారు యతీంద్రులు.
ఆదోనిలోని కొలువుకు చేరుకున్న రాఘవేంద్రులకు నవాబు మందీమార్బలం, రాజలాంఛనాలతో స్వాగతం పలికారు విలువైన కానుకలను ఆయనకు సమర్పించి, నమస్కరించి ఓ పక్కన నుంచున్నారు.  
చిరునవ్వుతో గురువరేణ్యులు నవాబు వైపు చూశారు.
అప్పుడు సిద్ధీ మసూద్‌ఖాన్‌ ‘గురు రాఘవేంద్రులకు సలాం. మీకు కొన్ని కానుకలు, నైవేద్యం ఇవ్వాలనుకుంటున్నాం. మేం తెచ్చిన నైవేద్యం మీరు తాకుతారా? మీ స్వామికి నివేదిస్తారా?’ అని అడిగారు.
అప్పుడు యతీంద్రులు ‘తప్పక నివేదిస్తాం భగవంతుడు ఒక్కడే. మనం పిలిచే పిలుపు, చూసే చూపులోనే భేదం. రాముడంటే రాముడవుతాడు. రహీం అంటే రహీం అవుతాడు’ అన్నారు. ఇంకా ఇలా కొనసాగించారు..‘మేం ఉదయం, సాయం సంధ్యా సమయాల్లో సగుణ స్వరూపంగా, నిర్గుణంగా...రెండు విధాలుగా భగవంతుణ్ణి పూజిస్తాం. మీరు నిర్గుణుడైన దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. జరిగేదంతా ఒకటే ప్రార్థన. అందుకునే దేవుడూ ఒక్కడే.’ అని ఉద్ఘాటించారు.
గురుదేవుల అద్వైత ధోరణికి, సర్వ దేవతా సమత్వ తత్త్వానికి ముగ్ధులై, చేతులెత్తి నమస్కరిస్తూ ‘యా అల్లా! అంతా మీలాగే బోధిస్తే ఈ మత భేదాలు, అల్లర్లు మచ్చుకైనా కనిపించవు. పరమత సహనం లేకపోవడం వల్ల మనం మానవులమన్న సంగతి కూడా మరిచిపోయి ప్రవర్తిస్తున్నాం’ అని అన్నారు నవాబు.
ఆపై రాఘవేంద్రులు ఆదోని నవాబు తీసుకొచ్చిన నిషిద్ధ నివేదనను తన చేతి స్పర్శతో దాన్ని పవిత్రంగా మార్చారు. మూల రాముని సన్నిధిలో ఉంచి పూజలు చేశారు.

- యల్లాప్రగడ మల్లికార్జునరావు,ఈడిగ రామకృష్ణ, మంత్రాలయం

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని