Published : 10/06/2021 01:34 IST
విధిని మార్చ తరమా?

తత్వసారం

ఇంద్రుడి భార్య ఇంద్రాణి ఒక చిలుకను ఎంతో ప్రేమగా పెంచుకునేది. ఒకరోజు దానికి జబ్బు చేసింది. ధన్వంతరికి చూపిస్తే చిలుక ఇక బతకటం కష్టమని చెప్పాడు.
‘మీరేం చేస్తారో నాకు తెలియదు. నా చిలుక బతకాలి. లేకుంటే నేనూ మరణిస్తాను’ అంది ఇంద్రాణి.
‘అన్ని జీవుల తలరాతలు రాసేది బ్రహ్మ కదా. వెళ్లి ఆయన్నే ప్రార్థిస్తాను. నువ్వు దిగులుపడకు’ అని బ్రహ్మ దగ్గరికి వెళ్లాడు ఇంద్రుడు.
‘నేను తలరాతలు మాత్రమే రాస్తాను. కానీ, జీవుల క్షేమం చూసేది విష్ణుమూర్తి. ఆ శేషశయనుడి దగ్గరికే వెళ్లి చిలుకను బతికించాలని అడుగుదాం’ అన్నాడు బ్రహ్మ.
‘చిలుక ప్రాణం చివరి దశలో ఉంది. మళ్లీ ఊపిరి పోయాలంటే లయకారుడైన శివుడికే సాధ్యం. ఆయన దగ్గరికి వెళదాం పదండి’ అన్నాడు విష్ణుమూర్తి. ముగ్గురూ కలిసి కైలాసానికి వెళ్లారు.
‘ప్రాణం తీసే పని యమధర్మరాజుకు అప్పజెప్పాను. చిలుక గురించి వెళ్లి ఆయన్నే అడుగుదాం’ అన్నాడు పరమ శివుడు.
నలుగురూ కలిసి యముడి దగ్గరికి వెళ్లారు. ‘చావుకు సిద్ధమైన జీవుల పేరు, మరణం ఎలా సంభవిస్తుంది అన్నది ఒక ఆకు మీద రాసి ఆ గదిలో వేలాడదీస్తాం’ అన్నాడు సమవర్తి.
ముగ్గురూ ఆ గదిలోకి వెళ్లగానే ఒక ఆకు రాలి పడింది. దాని మీద ఇలా రాసుంది.. ‘బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఇంద్రుడితో కలిసి ఈ గదిలోకి రాగానే ఈ చిలుక మరణిస్తుంది...’
అందుకే, విధిని ఎవరూ మార్చలేరు. అయితే, జీవించినంతకాలం అందరితో ఆదరంగా, ఆనందంగా ఉండాలి. తోటి వారికి మన వంతు సాయపడాలి. అప్పుడే జీవితానికి అర్థం, పరమార్థం.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని