Published : 10/06/2021 01:34 IST
హయాననా వందనం

సాక్షాత్తూ భగవంతుడి ద్వారా అందాయని భావించే వేదాల్ని పెంచి పోషించే దైవం (తండ్రి), అధిదైవం (తల్లి) ఉంటారు. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో బాగా ప్రచారంలోకి వచ్చిన ఈ వేద దేవతల ఆహార్య, ఆకృతుల వెనుక లోతైన అర్థాలున్నాయి. సామవేద దేవత విశిష్టతను చూస్తే..
అధర్వణ వేద దేవత పరిచయం వచ్చేవారం నీలోత్పల దళశ్యామో సామవేదో హయాననః।
అక్షమాలాన్వితో దక్షే వామే కుంభధరః స్మృతః।।  

* మంత్రాలకు సంగీత రూపం కల్పించి నాదోపాసన ద్వారా భగవంతుణ్ని ఎలా చేరవచ్చో చెబుతుంది సామవేదం.
* సామవేద దైవం ‘ఛన్దాసుడు’ లేదా ‘ఛందాసుడు’ నిగనిగలాడే నీల వర్ణపు శరీరం, గుర్రం ముఖంతో, కుడిచేతిలో అక్షమాల, ఎడమచేతిలో కుంభం (కలశం) ధరించి, గోధుమ రంగు సింహాసనం మీద కూర్చుని ఉంటాడు.
* గుర్రాన్ని ఛందస్సు అంటారు. సామవేదం ఛందోబద్ధంగా కూర్చిన మంత్రాల సమాహారం కాబట్టి ఛన్దాసుడికి గుర్రం ముఖం ఉంది.
* నాడులను శాంతపరచే రంగు నీలం. సామవేద సంగీతం అలసట, ఒత్తిడి పోగొట్టి ప్రశాంతత ఇస్తుంది. గోధుమ రంగు సింహాసనం కొత్త ఆవిష్కరణల సూచకం. కుంభం మంగళాలకి ప్రతీక.  
* భుజాన ఉన్న లేత గులాబీ రంగు కండువా సామరస్య సూచకం. అంటే- సామవేదాన్ని సామరస్యంగా ఉపయోగిస్తే శుభమని చెప్పటం.  
* లేత గులాబీ రంగు చీర, లేత నీలి వర్ణపు రవిక ధరించి ఛన్దాసుడి ఎడమ తొడ మీద ఉండే అధిదైవం ‘సామాని’. ఈమె సాంత్వనకి, ధ్యాన స్థితికి ప్రతీక.
* సామవేద దైవ-అధిదైవాలు జీవిత సత్య శోధనకి, సత్వం (ప్రశాంతతని) అందించటానికి మాత్రమే కాకుండా అద్వైత సిద్ధిని, అమరత్వాన్ని ప్రసాదిస్తారు.
* సామ, అధర్వణ వేదాలు రెండింటిని ‘జిజ్ఞరే’ అనే ప్రత్యేక పదంతో సంబోధించింది నిరుక్తం. అంటే ‘అనేక విద్యలకు నెలవు’ అని.
* సామవేదంలో వైద్యం, ఇతర శాస్త్రాలకు సంబంధించి ఎన్నో విషయాలు దాగున్నాయని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి.

ఛన్దాసుడి పంచె రంగు నీలం, ఆకుపచ్చల కలయిక. తాను లేని చోటు (అంతరిక్షం నుంచి పాతాళం వరకు) లేదని, తనతో ఆటలాడితే ప్రమాదమని ఈ రంగు సూచిస్తుంది. అంతరిక్షంలో, పాతాళంలో ఏక రూపంలో ఉన్నది మనకు వినిపించని శబ్ద (ఛందస్సు) రూప నిశబ్దం. ఈ నిశబ్ద తరంగాలతో ఆటలాడకూడదు. అలా మనిషి వాటితో ఆడుకొని తయారు చేసినవే సూపర్‌, అల్ట్రా సోనిక్‌ క్షిపణులు. ఇవి చాలా ప్రమాదం కదా! అలాగే నీలం- శబ్ద నిశబ్దాల్ని, ఆకుపచ్చ- జీవకోటిని తెలుపుతాయి.

- చల్లా జయదేవ్‌

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని