Updated : 03/06/2021 05:55 IST
వేద దేవతా వందనం

భారతీయ సంప్రదాయం జీవన నాదంగా భావించే వేదాల్ని పెంచి పోషించే దైవం (తండ్రి), అధిదైవం (తల్లి) ఉంటారు. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో బాగా ప్రచారంలోకి వచ్చిన ఈ వేద దేవతల ఆహార్య, ఆకృతుల వెనుక లోతైన అర్థాలున్నాయి. యజుర్వేద దేవత విశిష్టతను చూస్తే...2


తక్కువ ఆమ్లజని ఉండే పర్వత ప్రాంతాల్లో సైతం మేక మనగలదు. అంటే శ్వాసను నియంత్రించటం  ఈ జీవికి తెలుసు. యజుర్వేద మంత్రాలను వల్లించేటప్పుడు శ్వాస నియంత్రణ చాలా ప్రధానం. దీన్ని యజుడు ప్రసాదిస్తాడు. శ్వాస మీద నియంత్రణ వస్తే మనిషి ఆయుష్షు పెరుగుతుంది.

 

అజాస్యః పీతవర్ణస్స్యాత్‌ యజుర్వేదో క్షసూత్ర ధృత్‌।
వామే కులిశపాణిస్తు భూతిదో మంగళప్రదః।।  

రుగ్వేద మంత్రాలకు నిర్దిష్ట శారీరక కర్మను ఏర్పరచి యజ్ఞాలు, వ్రతాలు, నోములు, పూజలు ఎలా చేయాలో చెబుతుంది యజుర్వేదం. ఈ వేద దైవం ‘యజుడు’ మేక ముఖం కలిగి ఉంటాడు. మేక దృష్టి చాలా దూరం ప్రసరిస్తుంది. యజుర్వేదంలోని మంత్రాలు, కర్మకాండలకు విస్తృత, దీర్ఘకాలిక లాభాలను ఇచ్చే గుణం ఉందని చెప్పటానికి యజుని ముఖం మేకలా ఉంటుందని నిరుక్తం చెప్పింది.
యజుడు పసుపు పచ్చని శరీరం, తెల్లని వస్త్రం, భుజం మీద ఎరుపు రంగు కండువా, కుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో వజ్రాయుధంతో కనిపిస్తాడు. పసుపుపచ్చ వృద్ధి, జ్ఞానం, గురుత్వానికి ప్రతీక. పసుపు రంగుని కామదం అంటారు. అంటే కోరిన కోర్కెలు తీర్చేది. యజుడు యజ్ఞం, నోములు, వ్రతాలకు అధిపతి కాబట్టి ఆయన శరీరం రంగు (పసుపు)లో ఉండే వస్తువులతో యజ్ఞం, పూజ, నోములు లాంటివి చేస్తే అభీష్టం త్వరగా నెరవేరుతుందని చెబుతారు.
యజుడి వస్త్ర తెలుపు రంగు జ్ఞానానికి, కండువా ఎరుపు యజ్ఞ క్రతువుల్లో అగ్నికి ప్రతీక. వజ్రాయుధం శత్రు నిర్మూలన సూచకం. యజుడు నీలి రంగు సింహాసనం మీద ప్రశాంత చిత్తంతో కనిపిస్తాడు. ఈ దైవం ఐశ్వర్యం, దీర్ఘాయువు, శుభం కలిగిస్తాడు.  
యజుడి ఎడమ తొడ మీద అధిదేవత ‘యజ్ఞేశ్వరి’ ఆకుపచ్చ రంగు చీర, ఎర్ర రవిక ధరించి ఉంటుంది. యజ్ఞ పుణ్య ఫలాలను ఈమె ప్రసాదిస్తుంది. ఇంద్రుడి భార్య శచీదేవి ఈమె అంశే కావటం విశేషం. ఈమె ధరించిన చీర, రవిక యజ్ఞంలో వాడే వివిధ రకాల సమిధలకు సూచకం. ఆకుపచ్చ సౌభాగ్యానికి, వృక్ష సమిధలకు, ఎరుపు మంగళప్రద కార్యాలకు చిహ్నాలు.

- చల్లా జయదేవ్‌

సామవేద దేవత పరిచయం వచ్చేవారం  

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని