Published : 13/05/2021 00:19 IST
అదే శుద్ధి... జ్ఞానసిద్ధి

మే 14 బసవ జయంతి

‘మాటలో మంచితనం ఉండాలి. చేతల్లో అది నిత్యం కనపడాలి. వీటికి దూరంగా ఉంటూ ఎవరెన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు ఆచరించినా ఫలితం ఉండదు’ అంటూ పన్నెండో శతాబ్దంలో బలంగా వినిపించిన భక్తి, సంఘసంస్కరణ గళం బసవేశ్వరుడు. ఉత్తమ జీవితానికి ఆయన చూపిన మార్గాలు, చెప్పిన వచనాలు ఎప్పటికీ అనుసరణీయాలు.
దొంగిలించవద్దు, చంపవద్దు, పొల్లు మాటాడవద్దు
అలక వద్దు, అన్యుల నసహ్యించుకోవద్దు
తన్ను పొగుడుకొనవద్దు, ఎవరిని తిట్టవద్దు
ఇదే అంతరంగ శుద్ధి, ఇదే బహిరంగ శుద్ధి
ఇదే మన కూడల సంగమదేవుని వలపించే విధానం

అని తేల్చి చెప్పిన బసవన్న మాటల్లో సర్వమానవ సౌభ్రాతృత్వం కనిపిస్తుంది. అంతరంగ, బహిరంగ శుద్ధికి అసలైన మార్గం దర్శనమిస్తుంది.
జ్ఞానబలంతో అజ్ఞానానికి కీడు చూడవయ్యా
జ్యోతిబలంతో కారుచీకటికి కీడు చూడవయ్యా
సత్యబలంతో అసత్యానికి కీడు చూడవయ్యా

అంటూ, అజ్ఞానమనే కారుచీకటిలోంచి వెలుగుదారిలోకి రావాలంటే ముందు మూఢవిశ్వాసాల సంకెళ్లు ఛేదించుకుని, తోటి మనుషులను ప్రేమించటం అలవర్చుకోవాలని చెబుతాడు బసవేశ్వరుడు. ఇదే ఆయన భక్తి మార్గం. కల్మషం లేని మనసు ముఖ్యమనే ముక్తి మార్గం.
చిలుక ఇతరులకు జోస్యం చెప్పి ఏమి ఫలం?
పిల్లి వచ్చుటెరగదు జగమంతా చూచు కన్ను
తనను చంపు బాణాన్ని చూడనేరదు
ఎదిరి గుణము తెలుసునంటారు
తమ గుణమెరగరు కూడల సంగమదేవా

స్వీయలోపాలను ఎరగటమే పెద్ద విద్య అన్న విషయాన్ని మరచిపోయి, లోకుల మీద తీర్పులు చెప్పటానికి బయల్దేరటం ప్రాజ్ఞుల లక్షణం కాదు. అలాంటి వారెప్పుడూ దైవానికి దగ్గర కాలేరన్నది బసవన్న హిత‘వచనం’!
ఎప్పుడొచ్చారు బావున్నారా అన్నంతనే
మీ ఐశ్వర్యం ఎగిరిపోతుందా?
పెట్టలేకపోయినా ఒక్క గుణమైనా లేకుంటే
ముక్కును కోయక వదిలేనా కూడల సంగమదేవుడు

అతిథులకు షడ్రుచులతో విందు భోజనం పెట్టకపోయినా నిండు మనసుతో వారి మంచిచెడ్డలు విచారించనివారు దైవకృపకు ఎలా పాత్రులవుతారన్నది బసవన్న సూటి ప్రశ్న! నిన్ను నువ్వు తెలుసుకోవటమే (గెలవటం) మోక్షం! ఆ జ్ఞానం సిద్ధిస్తేనే ‘నేను’ నుంచి ‘మనం’ అనే వసుధైక కుటుంబ భావనలోకి ప్రవేశిస్తాం. బసవేశ్వరుడు కోరుకున్నది కూడా ఆ చైతన్యమే.

- ఆషాశ్రీ అయినాల

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని