Updated : 11/02/2021 01:49 IST
త్యాగబ్రహ్మకు స్ఫూర్తి ఈ గానబ్రహ్మ!

ఆ తల్లి తన ముద్దుల కొడుకును ఆడిస్తూ.. ‘ఏ తీరుగ నను దయజూచెదవో ఇనవంశోత్తమ రామా..’ అని ఆలపించేది.
మరోసారి బిడ్డ మారాం చేస్తుంటే ‘గరుడ గమన రారా, నీ కరుణనేలుకోరా..’ అంటూ మరో కీర్తన అందుకునేది. ఆర్తితో కూడిన ఆ ఆలాపనకు ఆ పసివాడు ఎవరు వస్తున్నారా అని గుమ్మం వైపు చూసేవాడు.
ఇంకోసారి ‘శ్రీరామ నీ నామమేమి రుచిరా...’ అని భజన అందుకోగానే తానూ ముద్దుముద్దుగా ‘రామారామా’ అంటుండేవాడు...
ఆలా ఆ బాలుడు రామనామ మాధుర్యాన్నే కాదు, ఆ సంకీర్తనా సంప్రదాయాన్ని కూడా పుణికిపుచ్చుకున్నాడు.
ఆ తల్లి సీతమ్మ, ఆ తల్లి నోట రామ నామం విని తరించి, మరో వాగ్గేయకారుడిగా అవతరించిన నాద బ్రహ్మ త్యాగరాజస్వామి. ఆమె నోట వెలువడిన ఆ అమృతకీర్తనలు భక్త రామదాసువి. అలా గాన కవితా కళాసుధానిధి, కర్ణాటక సంగీత చక్రవర్తి త్యాగరాజస్వామి వారి భక్తికి, సంకీర్తనా సృష్టికి స్ఫూర్తి భద్రాచల రామదాసు. అంతేకాదు, త్యాగరాజస్వామి మాతృమూర్తి సీతమ్మ బాల త్యాగరాజుతో తంజావూరు దేవాలయాల్లో రామదాసు కీర్తనలు పాడించేవారు. త్యాగరాజు తన కీర్తనల్లో రామదాసు భక్తికి నీరాజనాన్ని అర్పించి కీర్తించడం దీనికి నిదర్శనం. తెలుగు వాగ్గేయధారకు రామభక్తి రసామృతాన్ని రంగరించిన పరమ భాగవతోత్తముడు భద్రాచల రామదాసు. తిరుమల గిరుల్లో అన్నమయ్య కీర్తనలు ప్రతిధ్వనిస్తే, భద్రాచల గౌతమీ తీరంలో రాముడికి నివేదనగా రామదాసు కీర్తనలు వీనులవిందు చేశాయి. పదహారో ఏటనే కంచెర్ల గోపన్న  శ్రీరాముని స్వప్నదర్శనం పొందాడని చెబుతారు. తర్వాత రామచంద్రుడే లోకంగా ఆయన  బతికాడు. తొలుత ఆర్తితో దాశరథి శతకం రాసినా, తర్వాత పరమ భక్తితో ఆయన రాసిన కీర్తనలన్నీ శరణాగతికి, ఆత్మనివేదనకు ప్రతీకలు. ఆ కీర్తనల్లోని భావనలన్నీ భక్తిరసామృత బిందువులు.


*తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు...’ అంటూ భగవంతుని నమ్మి నిశ్చింతగా ఉండొచ్చన్న విశ్వాసాన్ని భక్తులకు కల్పించారు రామదాసు. తన వృత్తి ధర్మానికి, భక్తిప్రపత్తులకు మధ్య సంఘర్షణ తలెత్తినప్పుడు కూడా   ‘శ్రీరామనామం మరువాం మరువాం.. సిద్ధము యమునికి వెరువాం వెరువాం...’ అంటూ రామచంద్రునిపై పూర్తి భారం వేశాడు రామదాసు..
* ఓ నాస్తికుడు ఓ పరమభక్తుడితో ‘దేవుడు ఉన్నాడా?’ అని ప్రశ్నించాడట. అప్పుడా భక్తుడు ‘దేవుడే ఉన్నాడు!’ అని సమాధానమిచ్చాడట. పరమాత్మ తప్ప ఈ ప్రపంచంలో మరేదీ లేదన్నది అతని భావన. అలాంటి దృష్టితోనే రామదాసు ‘అంతా రామమయం, ఈ జగమంతా రామమయం.. నదులు, వనములు, నానా మృగములు అంతా రామమయం..’ అంటూ కీర్తించాడు.
* భక్తులకు ఆత్మగౌరవమే ఆభరణం. భక్తికి ప్రధాన అర్హత భగవంతుడికి మాత్రమే దాసులుగా ఉండడం. ‘నరహరి నమ్మక నరులను నమ్మితె నరజన్మ మీడేరునా ఓ మనసా...’ అంటూ భగవంతుడిని నమ్ముకుంటేనే జన్మకు సార్థకత అని ఓ కీర్తనలో మనసుకు హితవు పలికారు రామదాసు.
*  సుఖాలే కాదు కష్టాలు కూడా పరమాత్మ ప్రసాదమే. కన్నీళ్ల వేళల్లోనే ఆ సర్వేశ్వరుడు మనకు ఎక్కువ సమీపంగా ఉంటాడు.  అందుకే భాగవతోత్తములు భోగభాగ్యాలను కోరుకోరు. రామదాసు కూడా అంటే
‘ఏ తీరుగ నను దయజూచెదవో’ అన్న కీర్తనలో ‘దారిద్య్రము పరిహారము సేయవె దైవశిఖామణి రామా!’ అన్నారు.
* సిసలైన భక్తులకు కష్టాలు ముక్తి మార్గాలు. అందుకే పన్నెండేళ్ల చెరసాల శిక్షను కూడా రామదాసు తన భక్తికి పరీక్షగా భావించుకున్నారు. కఠిన కారాగార శిక్ష అనుభవిస్తూ కూడా ‘చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి..’ అని పరవళంతో పాడుకున్నాడు.

 

-సైదులు

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని