Updated : 04/02/2021 04:33 IST
కీర్తించవే మనసా!  

భగవత్‌ భక్తిలో లీనమైతే... అఖండ శక్తిలో తాదాత్మ్యం చెందితే... ఆ అనంత ఆనందంలో హృదయం దేవదేవుణ్ణి స్తుతిస్తుంది. ఆయన గుణగణాలను కీరిస్తూ దండకాలు చదువుతుంది.అసలేంటీ దండకం?
తెలుగులో మొట్టమొదటిగా ఆదికవి నన్నయ్య దండకాన్ని పరిచయం చేశారు మహాభారతం  అరణ్యపర్వంలో అర్జునుడు చేసిన శివస్తోత్రాన్నే దండకం రూపంలో రచించారు. శ్రీకంఠ లోకేశ...లోకోధ్భవత్కాల...। అంటూ శివుని విశేషాలను తెలుపుతుందీ దండకం.
పరవశం అంటే వశమైపోవడం. ఎవరికి వశం కావాలి? అంటే భగవంతుడికి అని అర్థం చేసుకోవాలి. అకుంఠిత భక్తికి ముఖ్య లక్షణమిది.
ఆ స్థితి రావాలంటే మనసుకి కొన్ని  ప్రత్యేక భావాలు కలగాలి. భగవంతుడి స్మరణలో తాదాత్మ్యం చెందాలి. భజన, కీర్తన, నృత్యం వంటివి అందుకు దోహదం చేస్తాయి. అందుకే భగవదారాధనలో వీటినన్నిటినీ అంతర్భాగాలుగా చేశారు పౌరాణికులు. అలా మదిలో అనేక అనుభూతుల పరంపర కలుగుతుంది. వాటిలోంచి పుట్టుకొచ్చేవే పైవన్నీ. వాటిలో దండకం ఒకటి. ఇది ఒక విలక్షణమైన సాహిత్య ప్రక్రియ. దేవతలను స్తోత్రం చేయడమే లక్ష్యంగా ఇది మొదలైంది. దేవతాస్తుతి కోసమే ఏర్పడ్డ శబ్ద, నాద, తాళ ప్రక్రియ దండకం. పాడేటప్పుడు లయాత్మకంగా సాగుతుంది. శ్వాసని సక్రమమైన రీతిలో నియంత్రించి ఏకధాటిగా పలకగలిగితే ఒకరకమైన తూగు వస్తుంది. వినేవారికి ఒక విధమైన ఊపు కలిగిస్తుంది.
దండకం అనే ప్రక్రియ సంస్కృతం నుంచి వచ్చింది. ఒకే పదం పదేపదే వస్తే కొన్నిసార్లు వేర్వేరు అర్థాలనిస్తుంది. అంత్యప్రాస, ముక్తపదగ్రస్తం దీని ప్రధానమైన లక్షణం. శ్రవణానందం దీని ఫలితం. భగవంతుని రూపురేఖా విలాసాలు, గుణగణాలు, స్వరూప స్వభావాలు, విశేష విషయాలు వంటివి ముఖ్యమైన ఆకర్షణలు. భగవంతునికి సంబంధించిన వింతలు, విశేషాలు, అంతరార్థాలు... వంటి వాటినెన్నిటినో  వ్యక్తపరిచే శక్తి దండకానికుంది. దీంతో వినేవారు, పఠించేవారు కూడా తన్మయత్వానికి లోనవుతారు.  

* కాళిదాసు చేసిన శ్యామలా దండకమే సంస్కృతంలో  మొదటి దండకంగా ప్రసిద్ధి పొందింది. నిరక్షరాస్యుడైన కాళిదాసు కాళికా దేవి కటాక్షంతో మహా పండితుడవుతాడు. ఆ సందర్భంలో ఆనందంతో తన్మయం చెంది
మాణిక్యా వీణా ముపలాలయంతీం        
మదాలసాం మంజుల వాగ్విలాసామ్‌
మహేంద్రనీలద్యుతి కోమలాంగీం  
మాతంగకన్యాం మనసా స్మరామి...।

అంటూ. మొదలుపెట్టి దేవి రూప, గుణ, శక్తి, విశేషాలను స్తుతిస్తారు. ఇదే శ్యామలా దండకం.
* పోతన. భాగవత తృతీయ, దశమ స్కంధాల్లో రెండు దండకాలు రచించారు.  ‘శ్రీనాథ నాథ!, నమ్రైకరక్షా!విపక్ష ! క్షమా భృత్సాహస్రాక్ష...’ అంటూ ఇంచుమించు 50 వాక్యాల్లా కనిపించే దండకం తృతీయ స్కంధంలోది. విష్ణు పాదపద్మాలే పుణ్య లోకాలకు తోవగా భావించి వాటిని ఆశ్రయించిన వారంతా ముక్తులయ్యారు... ఇంద్రియ చాపల్యం వల్ల మూర్ఖంగా ప్రవర్తించే వారు పరమాత్మ అనుగ్రహానికి దూరంగానే ఉంటారు...అంటూ బోధిస్తుందీ దండకం. భాగవతం దశమ స్కంధంలో  శ్రీ మానినీ మానసచోరా ! శుభాకారా ! వీరా ! జగద్ధేతు హేతు ప్రకారా !...అంటూ మరో 48 వాక్యాల్లాంటి ఏకవాక్య దండకం ఉంది ఇందులో శివవిష్ణు రూపాలకి అభేదత్వాన్ని బోధించారు పోతనామాత్యులు.కాలక్రమంలో వినాయక, సరస్వతి, లక్ష్మి, సుబ్రహ్మణ్య, సూర్య, ... ఇలా అనేక దేవతల దండకాలు వచ్చాయి. అన్నిట్లోకీ ప్రసిద్ధి చెందినది ఆంజనేయ దండకం.
శ్రీఆంజనేయం, ప్రసన్నాంజనేయం,
ప్రభాదివ్య కాయం, ప్రకీర్తి ప్రదాయం,
భజే వాయుపుత్రం, భజే వాలగాత్రం,

భజే సూర్యమిత్రం, భజే సచ్చరిత్రం...। ఇలా లయాత్మకంగా సాగే తీరు వల్ల మానసికోల్లాసం కలిగి మనసులో ఉండే భయం మాయమై ఆ స్థానంలో ధైర్యం వస్తుంది. భగవత్తత్వాన్ని తెలుసుకోగోరేవారు శ్రద్ధగా, సమగ్రంగా, సాంతంగా దండకాన్ని చదివితే భగవంతుని సమగ్ర స్వరూప స్వభావాలు అవగతమవుతాయి. భక్తి తాలూకు అసలు సారం బోధపడుతుంది.

- రమా శ్రీనివాస్‌

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని