గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

ప్రధానాంశాలు

ఐశ్వర్యరాయ్‌కి పాజిటివ్‌

ఆమె కుమార్తె ఆరాధ్యకూ... బాలీవుడ్‌లో మరికొందరికి సైతం
కోలుకుంటున్న అమితాబ్‌, అభిషేక్‌

ముంబయి: అగ్రనటుడు అమితాబ్‌ బచ్చన్‌ కుటుంబంలో మరో ఇద్దరికి కరోనా సోకింది. కోడలు, ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌, మనుమరాలు ఆరాధ్య(8)లకు పరీక్షల్లో పాజిటివ్‌ ఉన్నట్టు తేలింది. ఈ విషయాన్ని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్‌ టోపే ఆదివారం ట్వీట్‌ ద్వారా తెలిపారు. అమితాబ్‌ భార్య, ప్రముఖ నటి జయా బచ్చన్‌కు నెగిటివ్‌ వచ్చినట్టు వెల్లడించారు. ఐశ్వర్య, ఆరాధ్యలకు అసింప్టోమేటిక్‌ లక్షణాలు కనిపించాయని మంత్రి తెలిపారు. వారి పరీక్షల రిపోర్టులను తొలుత ట్విట్టర్‌తో జత చేసిన మంత్రి అనంతరం వాటిని తొలగించారు. తల్లీ కుమార్తెలను ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంచాలా, ఆసుపత్రిలో చేర్పించాలా అన్నది కుటుంబ సభ్యుల ఇష్టంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. వారు ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంటే సరిపోతుందని వైద్యులు సిఫార్సు చేశారు. ఆ మేరకు వారు ఇంట్లోనే ఉంటారని అభిషేక్‌ బచ్చన్‌ స్పష్టం చేశారు. కరోనా సోకిన అమితాబ్‌తోపాటు, కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌లు ప్రస్తుతం నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐసొలేషన్‌ వార్డులో ఉన్న వారిద్దరూ కోలుకుంటున్నారని ఆసుపత్రి క్రిటికల్‌ కేర్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అబ్దుల్‌ సమద్‌ అన్సారీ చెప్పారు. సుఖంగా నిద్రపోయారని, అల్పాహారం తీసుకున్నారని తెలిపారు. వారు నివాసం ఉంటున్న ప్రాంతాన్ని కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించామని మేయర్‌ కిశోరీ పడ్నేకర్‌ తెలిపారు. ఆ ప్రాంతంలోని వారంతా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుందని చెప్పారు. అమితాబ్‌కు చెందిన నాలుగు బంగ్లాలైన వత్స, జనక్‌, జల్సా, ప్రతీక్షలను నగరపాలక సంస్థల అధికారులు సందర్శించి వాటిని శానిటైజ్‌ చేయించారు. అక్కడ పనిచేసే 30 మందికి స్క్రీనింగ్‌ జరిపారు. సిబ్బందికి జరిపిన పరీక్షల నివేదికలు ఇంకా అందాల్సి ఉందని మంత్రి పేర్కొన్నారు. బంగ్లాలతోపాటు, నానావతి ఆసుపత్రి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. బచ్చన్‌ కుటుంబం కోలుకోవాలని ప్రార్థిస్తూ ఉజ్జయినిలో అభిమానులు పూజలు చేశారు.

అనుపమ్‌ ఖేర్‌ కుటుంబ సభ్యులకు పాజిటివ్‌
ప్రముఖ నటుడు అనుపమ్‌ ఖేర్‌ కుటుంబ సభ్యులకు కరోనా సోకింది. తల్లి దులారీ, సోదరుడు రాజు, ఇతర కుటుంబ సభ్యులకు పాజిటివ్‌ వచ్చినట్టు ఆయన తెలిపారు. తల్లిని కోకిలాబెన్‌ ఆసుపత్రిలో చేర్పించగా, మిగిలిన వారంతా ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నారు.
కంటెయిన్‌మెంట్‌ ప్రాంతంగా రేఖ బంగ్లా
బాంద్రాలో ప్రముఖ నటి రేఖకు చెందిన బంగ్లా ‘సీ స్ప్రింగ్స్‌’ను నగర పాలక సంస్థ అధికారులు సీల్‌ చేసి, దాన్ని కంటెయిన్‌మెంట్‌ ప్రాంతంగా ప్రకటించారు. ఆ భవనం వద్ద పనిచేసే 65 ఏళ్ల గార్డుకు పాజిటివ్‌ రావడంతో ఈ చర్య తీసుకున్నారు. ఆ ప్రాంతంలో ఈ బంగ్లా ఒకటే ఉంటుంది. ఈ భవనంలో ఒక భాగాన్ని సీలు చేసి, గార్డును ఆసుపత్రికి పంపించామని ఓ అధికారి తెలిపారు.
మరికొందరు ప్రముఖులకు సోకినట్టు వదంతులు
ముంబయి నగరంలోని మరికొందరు ప్రముఖులకు కరోనా సోకినట్టు వదంతులు వ్యాపించాయి. అయితే ఇదంతా అసత్య ప్రచారమంటూ వారు ఖండించారు. ప్రముఖ నటి, భాజపా ఎంపీ హేమమాలిని ఆసుపత్రిలో చేరినట్టు వదంతులు రాగా తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ ఆమె ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. తాను ఇంట్లోనే కులాసాగా ఉన్నట్టు 28 సెకన్ల నిడివిగల వీడియోను ఉంచారు. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దంటూ ఆమె కుమార్తె, నటి, రచయిత్రి అయిన ఈషా దేవల్‌ మరో ట్వీట్‌లో తెలిపారు. ప్రముఖ డిజైనర్‌ రిద్ధిమ కపూర్‌ సాహ్ని కుటుంబ సభ్యులకు కూడా పాజిటివ్‌ వచ్చినట్టు వదంతులు వచ్చాయి. తల్లి నీతూ కపూర్‌; సోదరుడు, నటుడు రణబీర్‌ కపూర్‌కు సోకినట్టు తప్పుడు సమాచారం వ్యాప్తి చెందగా, వాటిని అమె ఖండించారు. రిద్ధిమ ఏర్పాటుచేసిన పుట్టిన రోజు పార్టీకి అమితాబ్‌ మనుమడు అగస్థ్య నందా వెళ్లారని, ఆయన ద్వారానే బచ్చన్‌ కుటుంబ సభ్యులకు పాజిటివ్‌ వచ్చిదంటూ సామాజిక మాధ్యమాల్లో వదంతులు షికారు చేశాయి. ఇదంతా పూర్తిగా తప్పుడు సమాచారమని, దీన్ని ఆపాలని ఆమె కోరారు.


మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని