సోమవారం, జులై 13, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

ప్రధానాంశాలు

బంకర్లోకి ట్రంప్‌

శ్వేతసౌధాన్ని తాకిన నిరసన జ్వాలలు
అల్లర్లతో అట్టుడుకుతున్న అమెరికా
140 నగరాలకు విస్తరించిన నిరసనలు
వాషింగ్టన్‌

మెరికా అట్టుడికిపోతోంది. శ్వేతజాతి అమెరికా పోలీసుల కర్కశత్వం కారణంగా ఆఫ్రో-అమెరికన్‌ వ్యక్తి జార్జి ఫ్లాయిడ్‌ మరణించిన తీరుపై సర్వత్రా ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్నాయి. సాక్షాత్తూ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకే ఈ సెగ తగిలింది. ఆయన తన కుటుంబంతో సహా శ్వేతసౌధంలోని బంకర్‌లో కొంతసేపు ఆశ్రయం పొందాల్సిన పరిస్థితి తలెత్తింది. అధ్యక్ష భవనానికి సమీపంలో విధ్వంసానికి పాల్పడుతున్న వారిని చెదరగొట్టడానికి పోలీసులు తొలుత బాష్పవాయువు ప్రయోగించారు. అప్పటికే ఆందోళనకారులు అక్కడకు సమీపంలోని భవనాల అద్దాలు పగులగొట్టి, వాటికి నిప్పంటించి గందరగోళం సృష్టించారు. ట్రంప్‌నకు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. ముందుజాగ్రత్త చర్యగా ట్రంప్‌ను, ఆయన సతీమణి మెలనియా, కుమారుడు బ్యారన్‌ను భద్రత బలగాలు హుటాహుటిన బంకర్‌లోకి తరలించినట్లు సీఎన్‌ఎన్‌ వెల్లడించింది. ట్రంప్‌ సోమవారమంతా బయటకు రాలేదు. దేశంలో విద్వేషాన్ని, అరాచకత్వాన్ని మీడియా ఎగదోస్తోందంటూ ట్విటర్‌ ద్వారా మాత్రం నిందించారు. రాజకీయ లక్ష్యాల సాధన కోసం ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగే స్వతంత్ర కార్యకర్తల బృందాలున్న ‘యాంటిఫా’ను ఉగ్రవాద సంస్థగా పరిగణిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. ఒక పథకం ప్రకారం ఈ సంస్థ కార్యకర్తలు హింసను ఎగదోస్తున్నారని ఆరోపించారు. శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తున్నవారిని పక్కదారి పట్టించి, హింసాత్మక సొంత ఎజెండాను అమలు చేసుకునేందుకు ఆ సంస్థ ప్రయత్నిస్తోందని అమెరికా అటార్నీ జనరల్‌ విలియం బార్ర్‌ పేర్కొన్నారు.

పాత్రికేయులకు తప్పని కష్టం  
ఆందోళన వార్తల కవరేజీకి వెళ్తున్న ప్రసార మాధ్యమాల సిబ్బందికి వేధింపులు ఎదురవుతున్నాయని, వీరిలో పలువురిని పోలీసులు అరెస్టు చేస్తున్నారని ‘పాత్రికేయుల పరిరక్షణ కమిటీ’ (సీపీజే) తెలిపింది. పోలీసులు, ఆందోళనకారుల నుంచే కాకుండా కరోనా వైరస్‌ నుంచీ ముప్పు ఉంటుందన్న విషయాన్ని గుర్తించి జాగ్రత్తగా మసలుకోవాలని పాత్రికేయులకు సూచించింది. కాల్పుల ప్రమాదాన్ని తప్పించుకునేందుకు భవనాల పైకప్పులు, బాల్కనీల నుంచి దృశ్యాలను చిత్రీకరించాలని సూచించింది. రబ్బరు తూటా తగిలి ఫ్రీలాన్స్‌ ఫొటోగ్రాఫర్‌ ఒకరు ఎడమ కన్నును కోల్పోయారు. మరో టీవీ పాత్రికేయుడూ మృత్యువు అంచు వరకు వెళ్లారు.
కొల్లగొట్టేశారు
ఆందోళనకారుల్లో కొంతమంది యథావిధిగా వ్యాపార, ఆర్థిక సంస్థలను కొల్లగొట్టే పనిని కొనసాగించారు. వాషింగ్టన్‌లోని కేపిటల్‌ బ్యాంక్‌ శాఖలోకి వారు చొరబడి ఆభరణాల పెట్టెలను ఎత్తుకెళ్లారు. మరో కాఫీ షాపునూ ఇలాగే దోచుకున్నారు. ఫిలడెల్ఫియాలోనూ పట్టపగలు అనేక దుకాణాలను కొల్లగొట్టారు. అమెరికాలో తాజా పరిణామాలు రాజకీయంగానూ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ట్రంప్‌ ప్రత్యర్థులు దీనిని ఎన్నికల అంశంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్లాయిడ్‌ మృతదేహానికి ఆయన స్వస్థలమైన హ్యూస్టన్‌లో అంత్యక్రియలు జరుగుతాయని ఆ నగర మేయర్‌ వెల్లడించినా, అది ఎప్పుడనేది చెప్పలేదు.

అరెస్టయినవారు : 4,000
అల్లర్లలో ప్రాణాలు కోల్పోయినవారు : 5
నిరసనలు కొనసాగుతున్న నగరాలు : 140
ఎన్ని నగరాల్లో కర్ఫ్యూ విధించారు? : 40

140 నగరాలకు విస్తరించిన నిరసనలు
అమెరికాలో దాదాపు 140 నగరాల్లో ప్రజలు పెద్దఎత్తున ఉద్యమిస్తున్నారు. వీటిలో తీవ్రత ఎక్కువగా ఉన్న 40 నగరాల్లో కర్ఫ్యూ విధించారు. ఆవేదన, ఆగ్రహం కలగలిసిన భావంతో రోడ్లపైకి వస్తున్న ప్రజలతో వరసగా ఆరో రోజు అనేక రాష్ట్రాలు హోరెత్తిపోయాయి. అల్లర్లలో కనీసం ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో ఆందోళనకారులు అరెస్టయ్యారు. అత్యధిక అరెస్టులు లాస్‌ఏంజెలిస్‌లºనే చోటు చేసుకున్నాయి. ఆ నగరంతో పాటు షికాగో, న్యూయార్క్‌, హ్యూస్టన్‌, ఫిలడెల్ఫియా, వాషింగ్టన్‌ డీసీ సహా ప్రధాన నగరాలన్నీ భగ్గుమంటున్నాయి. అరెస్టయినవారిలో న్యూయార్క్‌ నగర మేయర్‌ కుమార్తె కూడా ఉన్నారు. ఆ నగరంలో పెద్దఎత్తున నిరసనలు కొనసాగాయి. పోలీసుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయినవారికి నివాళిగా ప్రజలు టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద కొంతసేపు మౌనం పాటించారు. కాలిఫోర్నియాలో వాణిజ్య సంస్థలన్నీ మూతపడ్డాయి.

1968 తర్వాత ఇప్పుడే
గత కొన్ని దశాబ్దాల్లో అమెరికా కనీవినీ ఎరగని రీతిలో ఇప్పుడు నిరసనలు ఎగిసిపడుతున్నాయి. 1968లో మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ (జూనియర్‌) హత్యకు గురయ్యాక పెద్దఎత్తున పౌర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత దేశం నలుమూలలా అంతటి విధ్వంసం చెలరేగడం ఇదే ప్రథమం. మే 25న పోలీసుల చేతిలో ఫ్లాయిడ్‌ మరణించిన తర్వాత హింసాత్మక ఘటనలు క్రమంగా వివిధ ప్రాంతాలకు విస్తరిస్తుండడంతో కనీసం 20 రాష్ట్రాల్లో నేషనల్‌ గార్డ్‌ బలగాలను రంగంలో దించారు. మిన్నెసోటాలోని మినియాపోలిస్‌లో చిన్నస్థాయిలో మొదలైన ఆందోళనలు క్రమేపీ అమెరికా అంతటా కార్చిచ్చులా వ్యాపించాయి. బోస్టన్‌లో పోలీసు వాహనానికి ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఫిలడెల్ఫియాలో ఆందోళనకారులను, దుకాణాలను కొల్లగొడుతున్నవారిని చెదరగొట్టేందుకు సాయుధ పోలీసులు పెప్పర్‌ స్ప్రే ఉపయోగించారు. అనేక ప్రాంతాల్లో లాఠీఛార్జి జరిగింది. న్యూయార్క్‌లో కదంతొక్కిన ఆందోళనకారుల కారణంగా భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. కొన్నిచోట్ల భవనాలకు నిప్పు పెట్టడంతో భీతావహ వాతావరణం నెలకొంది. రాళ్లు రువ్విన ఘటనల్లో పలువురు పోలీసులు గాయపడ్డారు.


మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని