శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

ట్రంప్‌.. మమ్మల్ని నట్టేట్లో ముంచారు..

ఇంటర్నెట్‌డెస్క్‌: సిరియాలోని కుర్దులు మళ్లీ మోసపోయారు. 2014 నుంచి సిరియా, ఇరాక్‌ దేశాల్లో ఇస్లామిక్‌స్టేట్‌ ఉగ్రవాదులపై వీరి చేయూతతోనే అమెరికా సారథ్యంలోని సంకీర్ణసేనలు విజయం సాధించాయి. అయితే కుర్దులకు అండగా ఉన్న అమెరికా దళాలను వెనక్కు రప్పిస్తున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.. ఇదే అదనుగా కుర్దుల స్వాతంత్ర్య పోరాటం గిట్టని టర్కీ వారిపై సైనికచర్య ప్రారంభించడంతో కుర్దు సామాన్య ప్రజలు మరణిస్తున్నారు.

అమెరికా ఎందుకు మద్దతు ఇచ్చింది..
సిరియాలో ప్రజా తిరుగుబాటు అనంతరం దేశంలో అరాచకం ఏర్పడింది. అధ్యక్షుడు బషర్‌ అల్‌ అస్సాద్‌కు వ్యతిరేకంగా అనేక చోట్ల తిరుగుబాటు జరిగింది. అయితే ఈ ఉద్యమంలోకి ఇస్లామిక్‌ అతివాదులు ప్రవేశించడంతో అంతర్యుద్ధం ప్రారంభమైంది. ఇదే అవకాశంగా ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు దేశంలోని అనేక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. ఉత్తర ప్రాంతంలోని అల్‌రకా నగరాన్ని తమ రాజధానిగా ప్రకటించుకున్నారు. సిరియా తిరుగుబాటుదారులకు అమెరికా మద్దతు ప్రకటించింది. దీంతో సిరియా అధినేత అస్సాద్‌కు మద్దతుగా రష్యా రంగంలోకి దిగింది.  అమెరికా వాయుసేన దాడులు ఇస్లామిక్‌ ఉగ్రవాదులపై ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదు. అదే సమయంలో కుర్దులు వారికి ఆశాకిరణంగా కనిపించారు. సిరియా ఉత్తర ప్రాంతాల్లో కుర్దులు ఎక్కువగా ఉంటారు. వీరికి అధునాతన ఆయుధాలతో పాటు శిక్షణను పాశ్చాత్యదేశాలు ఇచ్చాయి. అమెరికా వాయుసేనకు అండగా కుర్దు దళాలు భూమార్గంలో ఇస్లామిక్‌ స్టేట్‌పై పోరాడాయి. ఈ పోరాటంలో వేలాదిమంది కుర్ధు యోధులు ప్రాణాలు కోల్పోయారు.  ఇస్లామిక్‌ స్టేట్‌ ఆధీనంలో ఉన్న ప్రాంతాలను ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకున్న కుర్దు రక్షణ దళాలకు తాజాగా అమెరికా అధినేత ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం ఒక్కసారిగా వారిని అభద్రతా భావంలోకి నెట్టివేసింది. 

టర్కీ అరాచకం
సిరియా నుంచి అమెరికా తప్పుకోవడంతో కుర్దులంటే గిట్టని సరిహద్దుదేశం టర్కీకి అనుకోని అవకాశం లభించింది. టర్కీలో దాదాపు 35 మిలియన్ల మంది కుర్దులున్నారు. సిరియాలోని ఉత్తరప్రాంతాల్లోనూ వీరి ప్రాబల్యం ఎక్కువ. అలాగే ఇరాక్‌, ఇరాన్‌లోనూ అధిక సంఖ్యలో ఉన్నారు.  కుర్దులు బలపడితే కుర్దిస్థాన్‌ ఏర్పాటుకు యత్నించవచ్చని టర్కీ ఆందోళన. దీంతో అకారణంగా సిరియాలోని కుర్దు ప్రాంతాలపై  టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ యుద్దం ప్రకటించారు. సిరియాతో సరిహద్దు వెంబడి ఒక సురక్షిత ప్రాంతాన్ని ఏర్పాటు చేసి అందులో సిరియా శరణార్దులను ఉంచాలని ప్రకటించారు. పైకి అలా చెబుతున్నా కుర్దులను  అణచివేయడానికే ఈ దాడి అన్నది బహిరంగ రహస్యమే. 

కుర్దుల కష్టాలు..
మొదటి ప్రపంచయుద్ధకాలం నుంచి కుర్దిస్థాన్‌ కోసం కుర్దులు పోరాటాలు చేస్తున్నారు.  1918లో వీరికి ప్రత్యేక దేశం ఏర్పడేందుకు అవకాశం ఏర్పడింది. అయితే టర్కీ దాడితో  నిలిచిపోయింది. బ్రిటన్‌, ఫ్రాన్స్‌లు టర్కీకి మద్దతునివ్వడంతో కుర్దులకు దేశం దక్కలేదు.  1924లో కుర్దులకు ఇరాక్‌ ప్రాంతంలో స్వతంత్రదేశం ఏర్పడినా బ్రిటన్‌ సాయంతో ఇరాక్‌ పాలకులు దాన్ని విఫలం చేశాయి. అనంతరం ఇరాక్‌పాలకుడు సద్దాం హుస్సేన్‌కు వ్యతిరేకంగా జరిపిన పోరాటంలోనూ కుర్దులు అమెరికాకు చేయూతనిచ్చాయి.  ప్రతిసారీ వీరి సాయం తీసుకొని తరువాత పాశ్చాత్యదేశాలు వీరికి మొండిచేయి చూపించడం గమనార్హం.

ట్రంప్‌ నిర్ణయంపై సైన్యంలో అసంతృప్తి
కుర్దులకు అండగా ఉన్న అమెరికా సైనికులను వెనక్కు తీసుకోవడాన్ని అమెరికా సైనికవర్గాలు సైతం తప్పుబట్టాయి. దీనిపై ఉన్నతాధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రంప్‌ వైఖరితో మధ్యప్రాచ్యంలో అమెరికా ప్రతిష్ట తగ్గే ప్రమాదముందని అమెరికా సైనికాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అస్సాద్‌తో కుర్దుల ఒప్పందం..
టర్కీ దాడులతో కుర్దుప్రాంతాలు విలవిలలాడుతున్నాయి. అనేకమంది సామాన్య ప్రజలు మృత్యువాత పడుతున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో కుర్దులు అధ్యక్షుడు అస్సాద్‌తో ఒప్పందం చేసుకున్నారు. ఫలితంగా వీరి ప్రాంతాల్లోకి సిరియా సేనలు ప్రవేశించాయి. టర్కీ దురాక్రమణను అడ్డుకుంటామని సిరియా పేర్కొంది.  దీంతో ఇన్నాళ్లూ సిరియాలో అమెరికా సాధించిన విజయాలు ఒక్కసారిగా మసకబారాయి. అమెరికాను ఇక మీదట విశ్వసించబోమని కుర్దు నేతలు చెబుతున్నారు. ట్రంప్‌ నిర్ణయం రష్యా-సిరియాకు వరంగా మారింది. రష్యా చేయూతతో సిరియా పాలకుడు అస్సాద్‌ తన అధ్యక్షపదవిని పదిలం చేసుకున్నారు. 

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని