శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

వివాదాస్పద స్థలం హిందువులదే!

దిల్లీ: యావద్దేశం ఉత్కంఠగా ఎదురు చూసిన అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసులో సుప్రీం కోర్టు నేడు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు వెల్లడించింది. వివాదాస్పద స్థలాన్ని అలహాబాద్‌ హైకోర్టు మూడు భాగాలుగా విభజించడం ఆమోదయోగ్యం కాదంది. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలాన్ని హిందువులకు అప్పగించాలని పేర్కొంది. ఆ స్థలంలో ఆలయం నిర్మించాలని స్పష్టం చేసింది. 
మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలం
మసీదు నిర్మాణానికి ముస్లింలకు అయోధ్యలోనే ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని కోర్టు నిర్ణయించింది. ఇందుకోసం సున్నీ వక్ఫ్‌ బోర్డుకు 5ఎకరాల స్థలం కేటాయించాలని న్యాయమూర్తులు ఆదేశించారు. కేంద్రం లేదా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వివాదాస్పద స్థలానికి సంబంధించి 3 నెలల్లో కేంద్రం ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. వివాదాస్పద స్థలాన్ని ట్రస్ట్‌ అధీనంలో ఉంచాలని ఆదేశించింది. ఆలయ నిర్మాణం, ట్రస్ట్‌ విధివిధానాలపై 3నెలల్లోగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. అంతకుముందు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ రంజన్‌ గొగొయి తీర్పులో భాగంగా విచారణ పూర్వాపరాలను సుదీర్ఘంగా చదివి వినిపించారు. 

షియా వక్ఫ్‌ బోర్డు పిటిషన్‌ కొట్టివేత..
ఉదయం సరిగ్గా 10.30నిమిషాలకు జస్టిస్‌ రంజన్‌ గొగొయి, జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ అశోక్‌భూషణ్‌, జస్టిస్‌ ఎస్‌ఏ నజీర్‌ బెంచ్‌పైకి చేరుకున్నారు. ఐదుగురు న్యాయమూర్తులు తీర్పుపై సంతకం చేశారు. అనంతరం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి తీర్పు చదవడం మొదలుపెట్టారు. దీన్ని చరిత్రాత్మక తీర్పుగా ప్రకటించారు. తొలుత షియా వక్ఫ్‌ బోర్డు నేషనల్‌ లీవ్‌ పిటిషన్‌ను కొట్టివేశారు. అలాగే నిర్మోహీ అఖాడా వ్యాజ్యాన్ని కూడా కొట్టివేశారు. 

ఏకగ్రీవ తీర్పు..
అయిదుగురు న్యాయమూర్తులు కలిసి ఏకగ్రీవ తీర్పు వెలువరించారు. ‘‘రాజకీయాలకు, చరిత్రకు అతీతంగా న్యాయం ఉండాలి. ఒక లౌకిక సంస్థగా కోర్టు భక్తుల విశ్వాసాలను పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే అన్ని వర్గాల మధ్య సమతుల్యత పాటిస్తూ అందరి విశ్వాసాలను పరిరక్షించాలి. ప్రాథమిక విలువలు, మతసామరస్యాన్ని ప్రార్థనా మందిరాల చట్టం పరిరక్షిస్తుంది. ఇది వ్యక్తిగత హక్కుల కోసం దాఖలు చేసిన వ్యాజ్యం కాదు. మసీదు ఎవరు కట్టారో ఎప్పుడు  కట్టారో స్పష్టం కాలేదని అలహాబాద్‌ హైకోర్టు చెప్పింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం వివాదాస్పద స్థలం ప్రభుత్వానికి చెందింది. పురావస్తుశాఖ నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకుంటున్నాం. ప్రస్తుత కట్టడంలోని నిర్మాణం ఇస్లామిక్‌ శైలిలో లేదని పురావస్తు శాఖ తెలిపింది. మసీదు నిర్మాణానికి ముందే ఆ స్థలంలో ఒక నిర్మాణం ఉంది. అయితే మందిరాన్ని కూల్చివేశారన్న ఆధారాలు మాత్రం లేవని పురావస్తు శాఖ నివేదిక పేర్కొంది. ఇది పెద్ద సంఖ్యలో ఉన్న హిందూ భక్తుల కోసం ఉద్దేశించింది. యాజమాన్య హక్కులనేవి నిర్దేశిత న్యాయసూత్రాల ప్రకారం నిర్ణయిస్తాం.’ 

రాముడు అయోధ్యలోనే జన్మించాడు..
‘రాముడు అయోధ్యలోనే జన్మించాడన్నది నిర్వివాదాంశం. ప్రధాన గుమ్మటం కింద గర్భాలయం ఉందని హిందువులు విశ్వసిస్తున్నారు. రెండు మతాల ప్రజలు వివాదాస్పద స్థలంలో ప్రార్థనలు చేసేవారు. రాముడు అయోధ్యలోనే జన్మించారని ముస్లిం వర్గాలు కూడా అంగీకరిస్తాయి. మొఘలుల సమయం నుంచే హక్కు ఉన్నట్లు వక్ఫ్‌ బోర్డు నిరూపించలేకపోయింది. శుక్రవారం ప్రార్థనలు చేసినట్లు మాత్రమే ఆధారాలు సమర్పించింది. లోపల ముస్లింలు, బయట హిందువులు ప్రార్థనలు చేసేవారు. ఈ కేసుకు అధికరణం 47వర్తించదు. 1856-57 ముందు లోనికి వెళ్లే హక్కు హిందువులకు ఉండేది కాదు. 1949లో ఆ స్థలం హిందువుల అధీనంలోకి వచ్చింది. 1949 తర్వాత ఆ స్థలం తమ అధీనంలో ఉన్నట్లు లేదా ప్రార్థనలు చేసినట్లు ముస్లింలు నిరూపించలేదు. 1886లోనే వివాదాస్పద స్థలం చుట్టూ రెయిలింగ్‌ ఏర్పాటు చేశారు. నిర్ణయానికి ముందు రెండు మతాల విశ్వాసాలను పరిగణనలోకి తీసుకున్నాం’’ అని సుదీర్ఘ తీర్పు చదివి వినిపించిన గొగొయి.. చివరగా వివాదాస్పద స్థలాన్ని హిందువులకు కేటాయిస్తూ తుదితీర్పు వెలువరించారు. అలాగే అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని ఆదేశించారు.

తుది తీర్పు నేపథ్యంలో హింసను, విద్వేషాలను ప్రేరేపించే సందేశాలను పంపేవారిపై కఠిన చర్యలు ఉంటాయని కేంద్రం హెచ్చరించింది. మరోవైపు శాంతి భద్రతలను కాపాడాలని, తీర్పును గౌరవించాలని రాజకీయ నేతలు, మత పెద్దలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి...

LIVE: అయోధ్యపై తుది తీర్పు 📹

అయోధ్య తీర్పు: లైవ్‌ అప్‌డేట్స్‌


Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని