ఎన్నికల ప్రచారంలో అన్నాచెల్లెళ్లు బిజీబిజీ
చెన్నై/గువాహటి: మరికొద్ది రోజుల్లో జరగనున్న నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసనసభ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ మనుగడకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. దీంతో ఈ ఎన్నికలపై హస్తం పార్టీ గట్టిగా దృష్టిపెట్టింది. ముఖ్యంగా అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల జరిగే రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తుండగా.. తాజాగా సోదరి ప్రియాంక గాంధీ కూడా ప్రచార బరిలో దిగారు. ప్రచారంలో భాగంగా ప్రజలతో కలిసి ఆడిపాడుతూ వారికి చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
కన్యాకుమారిలో రాహుల్ బస్కీలు
రాహుల్‌గాంధీ నేడు తమిళనాడులోని కన్యాకుమారిలో పర్యటించారు. ములగుమూడుబన్ ప్రాంతంలోని సెయింట్ జోసఫ్ పాఠశాల విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థిని తనతో పాటు పుషప్స్ చేస్తారా అని అడగ్గా.. రాహుల్ అందుకు ఒప్పుకున్నారు. విద్యార్థిని కంటే వేగంగా బస్కీలు తీసి ఆకట్టుకున్నారు. ఈ వీడియోను రాహుల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అంతకుముందు ఇక్కడి విద్యార్థులతో కలిసి రాహుల్ కాసేపు సరదాగా డ్యాన్స్ చేశారు.
మహిళలతో ప్రియాంక నృత్యం
మరోవైపు అసోంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి ప్రియాంకగాంధీ వాద్రా శంఖారావం పూరించారు. సోమవారం ఆ రాష్ట్రంలో పర్యటించిన ఆమె పలు కార్యక్రమంలో పాల్గొన్నారు. లఖింపూర్‌లో తేయాకు తోటల్లో పనిచేసే ఆదివాసీ మహిళలతో కలిసి వారి సంప్రదాయ ‘ఝుమర్’ నృత్యం చేశారు. ఈ వీడియోను కాంగ్రెస్ తమ ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.