టీకా తీసుకున్నవారు 10లక్షల మందిపైనే
దిల్లీ: కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్విరామంగా కొనసాగుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 10లక్షల మందికి పైగా టీకా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ అనుభవాలను తెలుసుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు లబ్ధిదారులతో మాట్లాడనున్నారు. మోదీ సొంత నియోజకవర్గమైన వారణాసిలో కొవిడ్ టీకా తీసుకున్నవారితో శుక్రవారం మధ్యాహ్నం 1.15 గంటలకు ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. ఈ కార్యక్రమాన్ని దేశ ప్రజలందరూ చూడాలని మోదీ కోరారు. దీని ద్వారా కొవిడ్ టీకాపై మరింత అవగాహన లభించినట్లవుతుందని ఆయన అన్నారు.
6 రోజుల్లో.. 10లక్షల మందికి..
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం దేశంలో జనవరి 16న ప్రారంభమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. గడిచిన ఆరు రోజుల్లో 10లక్షల మందికి పైనే టీకాలు వేశారు. గురువారం దేశవ్యాప్తంగా 1,043 కేంద్రాల్లో 2,33,530 మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు వ్యాక్సిన్ తీసుకున్నారు. దీంతో గురువారం నాటికి మొత్తంగా దేశంలో 10,40,014 మంది టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
తొలి విడతలో భాగంగా దేశవ్యాప్తంగా 3 కోట్ల మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు టీకాలు ఇవ్వనున్నారు. ఆ తర్వాత 50ఏళ్లు పైబడిన వారికి, ఇతర అనారోగ్యసమస్యలున్న 50ఏళ్ల లోపువారికి వ్యాక్సిన్లు అందిస్తామని కేంద్రం తెలిపింది. ప్రధాని మోదీ సహా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా రెండో దశలో టీకాలు తీసుకోనున్నట్లు సమాచారం.
ఇవీ చదవండి..
కరోనా: 2శాతానికి దిగువనే క్రియాశీల రేటు