రహదారి భద్రతా మాసోత్సవాలు ప్రారంభించిన మంత్రి
దిల్లీ: కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం రహదారి భద్రతా మాసోత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేంద్రం రహదారి భద్రతకు ప్రాధాన్యతనిస్తుందన్నారు. ‘‘ఇప్పటి వరకూ రహదారి భద్రతా వారోత్సవాలు నిర్వహించాం. ఇకపై మాసోత్సవాలు నిర్వహిస్తాం. రహదారి ప్రమాదాల్లో మరణించేవారిలో 70శాతం మంది 18-45 సంవత్సరాల వయసున్నవారే. రహదారి ప్రమాదాల్లో రోజుకు 415మంది మరణిస్తున్నారు. ఈ ప్రమాదాలను తగ్గించాల్సిన అవసరం కూడా ఉంది.’’ అని ఆయన అన్నారు. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే 2030కి లక్షల మందిని మనం పోగొట్టుకుంటామన్నారు. 2025కల్లా ప్రజల సహకారంతో రహదారి ప్రమాదాలను, మరణాలను 50శాతం తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. 2020లో స్వీడన్‌లో జరిగిన సమావేశంలో భారత్ పాల్గొంది. ఇందులో 2030కల్లా రహదారి ప్రమాద మరణాలను పూర్తిగా నివారించే విధానాలను వివరించినట్టు గడ్కరీ వెల్లడించారు.
‘‘ప్రపంచబ్యాంకు, ఆసియన్ డెవెలప్‌మెంట్ బ్యాంకు ఏడువేల కోట్ల రూపాయల విలువైన రెండు ప్రాజెక్టులకు రుణాలిచ్చేందుకు అంగీకరించాయి. ఆర్థికశాఖ నుంచి కూడా త్వరలో అనుమతి లభించనుంది. ఆ నిధులను రహదారులపై బ్లాక్‌స్పాట్లు, ప్రమాదకరమైన ప్రాంతాలను గుర్తించి వాటిని సరైన రీతికి మార్చేందుకు ఖర్చుచేస్తాం.’’ అని నితిన్ గడ్కరీ తెలిపారు. దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, మరో కేంద్ర మంత్రి వీకే సింగ్, నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ పాల్గొన్నారు. నివేదికల ప్రకారం ఏడాదికి భారత్‌లో సుమారు 5లక్షల రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందులో లక్షన్నర మంది మరణిస్తుండగా, మూడు లక్షల మంది గాయాలపాలవుతుండగా, కొందరు వికలాంగులుగా మారుతున్నారు.
ఇవీ చదవండి..