దిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మండిపడ్డారు. కేంద్రం తక్షణమే స్పందించి మూడు చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రైతుల సమస్యల పట్ల ఇలా అహంకారపూరితంగా వ్యవహరించిన తొలి ప్రభుత్వం ఇదేనని విమర్శించారు. ఈ మేరకు సోనియా చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ ట్విటర్ వేదికగా విడుదల చేసింది.
‘‘మోదీ ప్రభుత్వం తమ అహంకారపూరిత ధోరణి వీడాలి. మూడు వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకొని.. రైతుల ఆందోళనలకు ముగింపు పలకాలి. ప్రజాస్వామ్యం అంటే పేదలు, రైతులు, కూలీల ప్రయోజనాలను కాపాడటమే అనే విషయాన్ని మోదీ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. దిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్న రైతుల పరిస్థితి చూసి దేశంతో పాటు నేను సైతం ఎంతో చలించిపోయా. ఎముకలు కొరికే చలిలో వారు చేస్తున్న నిరసనలు ఎంతో బాధిస్తున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇప్పటికే చాలా మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. కానీ మోదీ ప్రభుత్వం మాత్రం ఇంతవరకు స్పందించడం లేదు. ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన రైతు సోదరులకు ఆత్మకు శాంతి చేకూరాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నా. పారిశ్రామికవేత్తలకు ఆదాయం కట్టబెట్టడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది’’ అంటూ సోనియా విమర్శించారు.
ఇదీ చదవండి