ప్రాధాన్యం పెరిగే కొద్దీ ఇది సహజమే అన్న భారత ఆర్మీ ఛీఫ్
దిల్లీ: భారత్ ముందుముందు మరిన్ని భద్రతా పరమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చని భారత ఆర్మీ ఛీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ వేదికపై దేశానికి పెరుగుతున్న ప్రాధాన్యానికి అనుగుణంగానే.. సవాళ్లూ అధికమవుతాయని ఆయన వివరించారు. అలాంటి పరిస్థితుల్లో విదేశాలపై ఆధారపడకుండా దేశీయంగా రక్షణ సామర్థ్యాలను పెంపొందించుకోవాలని అన్నారు.
సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మాన్యుఫాక్చరర్స్ సంస్థ ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో జనరల్ నరవణే ప్రసంగించారు. ‘‘భారత్..ఆసియా ఖండంలో, ప్రత్యేకించి దక్షణాసియాలో ప్రాంతీయ శక్తిగా ఎదుగుతోంది. అంతర్జాతీయంగా మన ప్రభావం, ప్రాముఖ్యత పెరుగుతున్న క్రమంలో భద్రతా సమస్యలు కూడా అధికం కావటం సహజమే.’’ అని ఆయన అన్నారు. అలాంటి సమయాల్లో ఆయుధ సంపత్తి కోసం ఇతరులపై ఆధారపడటం అంత ఆమోదయోగ్యం కాదని ఆయన అన్నారు. అటువంటి పరిస్థితుల్లో వ్యూహాత్మక ప్రభావాన్ని, నిర్ణయాలు తీసుకోగల స్వేచ్ఛను కొనసాగించేందుకు.. దేశీయ రక్షణ సామర్ధ్యాలను పెంపొందించుకోవాలని ఆయన వెల్లడించారు.
ప్రస్తుతం దేశం కొవిడ్ మహమ్మారి, దేశ ఉత్తర సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తతల రూపంలో ద్విముఖ సవాళ్లను ఎదుర్కొంటోందని ఆర్మీ చీఫ్ అన్నారు. ఐతే, స్వయం సమృద్ధిపై దృష్టి సారించాలన్న కేంద్రం నిర్ణయంతో దేశం వ్యూహాత్మక లక్ష్యాలు చేరుకోగలదని జనరల్ నరవణే విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి..