గాయపడిన తండ్రిని పరామర్శించేందుకు వచ్చిన జవాను
రోడ్డు ప్రమాదంలో గాయపడి, మృత్యువుతో పోరాడి కన్నుమూత
ఆర్మీ దినోత్సవం రోజే దుర్ఘటన
ఇందల్‌వాయి, న్యూస్‌టుడే: అనారోగ్యానికి గురైన తండ్రిని చూసేందుకు సెలవులపై వచ్చిన జవాను ఊహించని విధంగా రోడ్డుప్రమాదానికి గురయ్యారు. 18 రోజులపాటు మృత్యువుతో పోరాడి చివరికి ఆర్మీ దినోత్సవం రోజే తనువు చాలించారు. ఈ ఘటనతో నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయి మండలం మేగ్యానాయక్‌తండాలో విషాదం అలముకుంది. మేగ్యానాయక్‌తండాలో దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన దేగావత్ జోద్యానాయక్, జమ్లీబాయి దంపతులకు ముగ్గురు కుమారులు. రెండో కుమారుడు దేగావత్ మోతీలాల్(25) బీటెక్ పూర్తిచేశారు. 2017లో సైన్యంలో చేరారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో విధులు నిర్వర్తించారు. పొలం పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు తండ్రి కాలు విరిగిందనే సమాచారం తెలుసుకుని 15 రోజుల సెలవుపై నెల క్రితం స్వగ్రామానికి వచ్చారు. ఈ సమయంలోనే రూప్లనాయక్‌తండాకు చెందిన బంధువుల అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది కూడా.
తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతుండగా
సెలవులు పూర్తికావడంతో డిసెంబరు 29న పంజాబ్ వెళ్లడానికి సిద్ధమయ్యారు. 28వ తేదీ విమాన టికెట్ తీసుకొచ్చేందుకు కామారెడ్డిలోని తన స్నేహితుని వద్దకు ద్విచక్రవాహనంపై వెళ్లారు. తిరిగి వస్తుండగా సదాశివనగర్ మండలం దగ్గి వద్ద 44వ జాతీయ రహదారిపై వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో సంబంధీకులు హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం వేకువజామున మోతీలాల్ కన్నుమూశారు. తనను పరామర్శించేందుకు వచ్చిన కుమారుడు చివరికి తమకు శాశ్వతంగా దూరం కావడంతో తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. కుమారుడి వైద్యం కోసం రూ.8.72 లక్షలు ఖర్చు చేసి అప్పులపాలయ్యామని, తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, చిన్న కుమారుడికి ఉద్యోగం ఇప్పించాలని కోరుతున్నారు.