ఆదివారం, ఏప్రిల్ 05, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

వసతి గృహాలకు భరోసా!

మూసేస్తే యజమానులపై వేటు
ఇక ఎన్వోసీలు ఇవ్వలేమన్న పోలీసులు
ఉచిత భోజనం సరఫరా చేస్తామని మేయర్‌ వెల్లడి
ఈనాడు, హైదరాబాద్‌

భాగ్యనగరంలోని ప్రైవేటు వసతి గృహాలకు భరోసా దక్కింది. కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు.. వసతి గృహాలను సైతం మూసివేయాలన్న నిర్ణయంపై అధికారులు వెనక్కి తగ్గారు. లక్షకుపైగా విద్యార్థులు, ఉద్యోగుల జీవనం అగమ్యగోచరం కావొద్దన్న ఆలోచనతో నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. అదే సమయంలో యజమానులకు నిర్వహణ భారం నుంచి మినహాయింపు అందేలా నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ కీలక ప్రకటన చేశారు. వసతి గృహాలకు నాణ్యత, శుచి, శుభ్రతతో కూడిన భోజనాన్ని సరఫరా చేస్తామని, విద్యార్థులు ఎప్పటిలాగే కొనసాగవచ్చని స్పష్టం చేశారు. యాజమాన్యాలు విద్యార్థులను, ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తే వేటు తప్పదని పోలీసులు హెచ్చరించారు.

హైదరాబాద్‌ మహానగరంలో సుమారు 2 వేల వసతి గృహాలున్నాయి. వాటిలో లక్షకుపైగా విద్యార్థులు, ఉద్యోగులు ఉంటున్నారు. శిక్షణ తరగతులు, కళాశాలలు, పాఠశాల విద్యార్థులు వసతి గృహాలను ఇప్పటికే ఖాళీ చేశారు. ఉద్యోగాలు చేసుకునే వారు, పోటీ పరీక్షలకు చదువుతున్నవారు మాత్రం ఇక్కడే ఉంటున్నారు. ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలు, ఇతర ప్రైవేటు సంస్థలను మూసేయాలని ప్రకటించడంతో ఇటీవల జీహెచ్‌ఎంసీ అధికారులు కొందరు హాస్టళ్లను ఖాళీ చేయించాలని ప్రయత్నించారు. వెంటనే ఐటీ ఉద్యోగులు సుమారు వెయ్యి మంది బల్దియా నిర్ణయంపై తిరగబడ్డారు. సైబరాబాద్‌ పోలీసులను ఆశ్రయించారు. రాయదుర్గం, ఖాజాగూడ, గచ్చిబౌలి, మాదాపూర్‌, నానక్‌రామ్‌గూడ తదితర ప్రాంతాల్లోని హాస్టళ్లను మూసేయొద్దని విజ్ఞప్తి చేశారు. స్పందించిన పోలీసులు జీహెచ్‌ఎంసీతో మాట్లాడారు. ప్రభుత్వం మూసేయాలని పేర్కొన్న జాబితాలో వసతి గృహాలు లేవనడంతో అధికారులు తేరుకున్నారు. అంతలోనే ప్రభుత్వం స్వీయ నిర్బంధం ఆంక్షలను 21 రోజులు పొడిగించింది. ఏప్రిల్‌ 14 వరకు నగరంలో కర్ఫ్యూ వాతావరణం ఉంటుందని, ఉల్లంఘిస్తే కాల్చి పారేయాలన్న ఆదేశాలు జారీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తాజాగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చాలామంది వసతి గృహాల యజమానులు హాస్టళ్లను మూసివేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు ఉద్యోగులు, విద్యార్థులను ఇంటికెళ్లాలని సూచించారు. ఆ మేరకు చాలా విద్యార్థులు నగరంలోని వేర్వేరు పోలీస్‌స్టేషన్లలో ఊరికి వెళ్లేందుకు ఎన్వోసీ తీసుకునేందుకు వరుస కట్టారు. పలువురు తమ దీనావస్థను ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. చలించిన మంత్రి.. వెంటనే జీహెచ్‌ఎంసీ అధికారులను చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మేయర్‌ రామ్మోహన్‌ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దేందుకు నడుం బిగించారు. వసతి గృహాల యాజమాన్యాలకు అవసరమైన మేరకు మధ్యాహ్నం ఉచిత భోజనం అందిస్తామన్నారు. నగరవ్యాప్తంగా నడుస్తోన్న 150 అన్నపూర్ణ కేంద్రాల్లోనూ ఉచిత భోజనం అందిస్తామన్నారు. అదే సమయంలో నగరంలోని వేర్వేరు వసతి గృహాలు, నామాలగుండు నిరాశ్రయుల కేంద్రంలోని వసతులను పరిశీలించారు. స్వచ్ఛత, పారిశుద్ధ్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలని నిర్వాహకులకు సూచించారు. భోజన సరఫరా విషయంపై హరే కృష్ణ ఉద్యమ సంస్థ నిర్వాహకులతో మాట్లాడామని, సరిపడా ఆహార పదార్థాలను తయారు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని రామ్మోహన్‌ స్పష్టం చేశారు.

సరకులు తెచ్చుకునేందుకు అనుమతి..
వసతి గృహాల్లోని విద్యార్థులు, ఉద్యోగులకు బుధవారం అవసరమైన పాసులు ఇచ్చామని పశ్చిమ మండలం సంయుక్త కమిషనర్‌ ఏ.ఆర్‌.శ్రీనివాస్‌ ప్రకటించారు. యజమానులపై భారం పడకుండా ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చామన్నారు. కూరగాయలు, ఇతర దినుసులు తెచ్చుకునేందుకు నిర్వాహకులకు పాసులు ఇచ్చామన్నారు. హాస్టళ్లు మూసేస్తే యాజమన్యాలపై కఠిన చర్యలుంటాయని రాచకొండ పోలిస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ వెల్లడించారు.

Tags:
కామెంట్స్‌
కామెంట్‌ చేయండి!

లాగిన్ ద్వారా నమోదు చేయండి

మీ వివరాలు తో నమోదు చేయండి

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)