శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

విజయాల నిచ్చెనపై ఎవరెక్కడ?

2000 దశాబ్దంలో ఎవరి విజయాల శాతం ఎంత?

2010 దశాబ్దంలో ఎక్కడ నిలిచారు?

విజయానికి ఫుల్‌స్టాప్‌లు ఉండవు. కామాలే ఉంటాయి. మెరుగుదలకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. క్రీడలు సహా ఏ రంగానికీ ఇందులో మినహాయింపు లేదు. ఆటలో గెలుపోటములు సహజం. అలాగని ఆడే ప్రతి పోటీలో ఓడిపోతే అర్థమేముంటుంది. ఆ పరాజయం నుంచి పాఠాలు నేర్చి ముందుకెళ్లాలి. మొన్నటి కన్నా నిన్న.. నిన్నటి కన్నా నేడు.. నేటి కన్నా రేపు ఓ మెట్టు పైనే ఉండాలి. అప్పుడే అభివృద్ధి చెందినట్టు. 2010-19 దశాబ్దం ముగిసి ఎన్నో రోజులు గడవలేదు. మొన్నటి దశాబ్దంతో పోలిస్తే నిన్నటి దశాబ్దంలో వన్డే క్రికెట్లో ఏ జట్టు ఎక్కువ విజయాలు సాధించిందో తెలుసా!!


భారత్‌కు విజయీభవ

అంతకు ముందుతో పోలిస్తే గడిచిన దశాబ్దంలో ఎక్కువ విజయవంతమైంది భారత్‌. 2010-19లో టీమిండియా విజయాల శాతం ఏకంగా 66.11. ఇది 55.32 నుంచి పెరగడం గమనార్హం. సచిన్‌, గంగూలీ, సెహ్వాగ్‌, కుంబ్లే, లక్ష్మణ్, ద్రవిడ్‌ వంటి మహామహులు వీడినా ధోనీ, యువీ, కోహ్లీ, రోహిత్‌, అశ్విన్‌, రహానె, పుజారా వంటి క్రికెటర్లు భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లారు. 2000ల్లో టీమిండియా 307 మ్యాచులాడి 161 గెలిచి 130 ఓడింది. 2003లో ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరడం ఊరటనిచ్చే అంశం. 2010ల్లో 249 ఆడి 157 విజయాలు అందుకుంది. ఓటములు 79. ఐతే 2011 ప్రపంచకప్‌, 2013లో ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలవడం గమనార్హం.


సఫారీ సై సై

ప్రస్తుతం దక్షిణాఫ్రికా ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది కానీ విజయాల్లో టీమిండియా తర్వాత స్థానం సఫారీలదే. 62.56% గెలిచారు. 64.37 నుంచి తగ్గడం బాధాకరం. 2000ల్లో 254 మ్యాచులాడిన సఫారీలు 157 విజయాలు 86 పరాజయాలు పొందారు. 2010ల్లో 188 ఆడి 114 విజయాలు, 68 ఓటములతో నిలిచారు. కలిస్‌, స్టెయిన్‌, ఏబీడీ, ఆమ్లా వంటి క్రికెటర్లున్నా ఐసీసీ టోర్నీలు గెలవకపోవడం గమనార్హం.


శిఖరాగ్రం నుంచి

మెగా టోర్నీల్లో ఆస్ట్రేలియాను మించిన జట్టు లేదు. 2000ల్లో 75.09గా ఉన్న విజయాల శాతం మాత్రం 2010ల్లో 61.21కి తగ్గింది. 2003, 2007, 2015 ప్రపంచకప్‌లు ముద్దాడటం గమనార్హం. ఈ రెండు దశాబ్దాల్లో మెక్‌గ్రాత్‌, షేన్‌వార్న్‌, స్టీవ్‌ వా, హెడేన్‌, గిల్‌క్రిస్ట్‌, స్మిత్‌, వార్నర్‌, పాంటింగ్‌, బ్రెట్‌లీ, క్లార్క్‌ సహా ఎందరో క్రికెటర్లు ఆసీస్‌ను ముందుకు తీసుకెళ్లారు. 2000ల్లో 283 మ్యాచులు ఆడిన కంగారూలు 202 గెలిచి 66 మాత్రమే ఓడారు. 2010ల్లో 216 ఆడి 126 మాత్రమే గెలిచారు. 79 ఓడారు.


ఇంగ్లిష్‌ జట్టుకు పండగ

క్రికెట్‌కు పుట్టినిల్లు ఇంగ్లాండ్‌. ప్రపంచకప్‌ గెలిచేందుకు మాత్రం 2019 దాకా ఆగాల్సి వచ్చింది. 2000లతో పోలిస్తే 2010లో విజయాల శాతం మెరుగు పడింది. 2000ల్లో 224 మ్యాచులాడిన ఇంగ్లిష్‌ జట్టు 100 గెలిచి 111 ఓడింది. విజయాల శాతం 47.42. అదే 2010ల్లో 218 ఆడి 123 గెలిచింది. 82 ఓడి 59.80%తో నిలిచింది. గతంలో పోలిస్తే ఇప్పుడా జట్టులో విధ్వంసకర ఆటగాళ్లు పెరిగారు.


పాపం కివీస్‌

విజయాల శాతం మెరుగుపర్చుకున్న జట్లలో న్యూజిలాండ్‌ ఒకటి. అద్భుతమైన క్రికెటర్లున్న కివీస్‌ ఇంకా ప్రపంచకప్‌ గెలవకపోవడం బాధాకరం. 2019 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌, సూపర్‌ ఓవర్‌ టై అయినా ట్రోఫీ దక్కకపోవడం దురదృష్టమే. 2000ల్లో 239 మ్యాచులు ఆడిన ఆ జట్టు 113 గెలిచి 111 ఓడింది. విజయాల శాతం 50.44. ఇక 2010ల్లో 192 ఆడి 98 గెలిచి 82 ఓడింది. విజయాల శాతాన్ని 54.39కి పెంచుకుంది.


బంగ్లా ముందుబాట

సంచలన విజయాలతో పెద్ద జట్లకు షాకిచ్చి పసికూన కాదు కసికూన అనిపించుకుంది బంగ్లాదేశ్‌. షకిబ్‌, ముష్ఫికర్‌, ముస్తాఫిజుర్‌ వంటి చక్కని క్రికెటర్లు అక్కడి నుంచి వచ్చారు. 2000లతో పోలిస్తే 2010ల్లో బంగ్లా విజయాల శాతం 30.23 నుంచి 44.58కు పెరగడం గమనార్హం. గడిచిన దశాబ్దంలో 174 మ్యాచులాడిన బంగ్లా 52 విజయాలు సాధించి 120 పరాజయాలు చవిచూసింది. 2010ల్లో 162 ఆడి 70 విజయాలు, 87 పరాజయాలతో ఉంది.


పాక్‌ పాతాళం వైపు

ఒకవైపు బంగ్లా, అఫ్గాన్‌ దూసుకెళ్తోంటే పాక్‌ పాతాళానికి పడిపోవడం గమనార్హం. 2000ల్లో 267 మ్యాచులాడి 151 విజయాలు, 111 పరాజయాలు పొందింది. విజయాల శాతం 57.63. అదే 2010ల్లో 217 ఆడి 104 గెలిచింది. 106 ఓడింది. విజయాల శాతాన్ని ఏకంగా 49.52కు తగ్గించుకుంది. ఒకప్పుడు పదునైన పేసర్లు, దూకుడైన బ్యాట్స్‌మెన్‌తో తిరుగులేని విజయాలు అందుకున్న పాక్‌లో క్రికెట్‌ ప్రమాణాలు దారుణంగా ఉన్నాయి. డ్రెస్సింగ్‌ రూమ్‌లో రాజకీయాలు మొదలయ్యాయి.


దారుణంగా లంక

శ్రీలంక పరిస్థితీ దిగజారింది. విజయాల శాతం 58.23 నుంచి 47.10కు పడిపోయింది. ఆటగాళ్లకు నిలకడగా అవకాశాలు ఇవ్వకపోవడం ఆ దేశ క్రికెట్‌ భవిష్యత్తును ప్రశ్నార్థం చేసింది. నువ్వా నేనా అన్నట్టు హోరాహోరీగా తలపడే క్రికెటర్లు అక్కడ్నుంచి రావడం లేదు. దిగ్గజాలంతా ఒకేసారి వీడ్కోలు పలకడం, యువ ప్రతిభను సానబెట్టకపోవడం చేటు చేసింది. 2000ల్లో 276 మ్యాచులాడి 155 గెలిచిన లంక 111 ఓడింది. అదే 2010ల్లో 256 ఆడి 113 గెలిచి 127 ఓడింది.


కరీబియన్లు బాధాకరం

ఓడితే ప్రత్యర్థి దేశం అభిమానులూ బాధపడే జట్టు వెస్టిండీస్. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన కరీబియన్‌ జట్టు ఇప్పుడు సంధి దశలో కొట్టుమిట్టాడుతోంది. విజయాల శాతం క్రమంగా తగ్గుతోంది. 2000ల్లో 232 మ్యాచులాడి 94 గెలిచింది. 123 ఓడింది. విజయాల శాతం 43.31. ఇప్పుడది 38.03కు పడిపోయింది. 196 ఆడి 69 మాత్రమే గెలిచింది. 113 ఓడింది. కొత్త ఆటగాళ్లు వస్తుండటం, పునర్‌ వైభవం కోసం ప్రయత్నిస్తుండటం విండీస్‌కు సానుకూల అంశం.

- ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని