శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

అమ్మభాషకా అంపశయ్య?

శిశువుల శారీరక ఆరోగ్యానికి తల్లిపాలు, మానసిక వికాసానికి అమ్మభాష అత్యావశ్యకమనడంలో ఎలాంటి సందేహం లేదు. భూమ్మీద పడ్డ మరుక్షణమే అమ్మ మాటను గుర్తు పట్టే బుడతలు, కొత్త ప్రపంచ వీక్షణంలో భాగంగా పాఠశాల గుమ్మం ఎక్కే దశలోనూ అమ్మభాషలో చదువులే వారి ఎదుగుదలకు మేలిమి సోపానాలవుతాయని నిర్ద్వందంగా నిరూపించాయి ఎన్నెన్నో అధ్యయనాలు! పిల్లల్లో సృజన సామర్థ్యాలకు పదునుపెట్టేలా ప్రతి బడీ మాతృభాష వికాసానికి నారుమడి కావాల్సిన వేళ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వెలువరించిన ఆదేశాలు అమ్మభాషను అంపశయ్యపైకి చేర్చేలా ఉన్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్తు పాఠశాలల్లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతులను పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోకి మార్చనున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. తదుపరి సంవత్సరాల్లో తొమ్మిది, పదో తరగతులకూ ఆంగ్ల మాధ్యమాన్నే నిర్ధారించిన ప్రభుత్వం- ఆంగ్ల భాషలో ప్రావీణ్యం, అర్హత గల వారినే ఉపాధ్యాయులుగా నియమిస్తామంటోంది. దానాదీనా ఏపీలోని అన్ని పాఠశాలల్లో తెలుగు బోధన ఒక పాఠ్యాంశం స్థాయికి పరిమితమైపోనుంది. దేశంలోనే మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆవిర్భవించిన పోతుగడ్డ మీద క్రమంగా తెనుగు నుడికారం కనుమరుగయ్యేలా ఉన్న ప్రస్తుత దుస్థితి- ఆలోచనాపరుల్ని కలచివేస్తోంది! ప్రపంచంతో పోటీపడాలన్నా, పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందాలన్నా ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి కావాలన్నది మంత్రివర్యుల వాదన. అక్టోబరుదాకా నమోదైన 70 లక్షల 90వేల పైచిలుకు విద్యార్థుల్లో మూడింట రెండొంతులు ఆంగ్ల మాధ్యమంలోనే ఉన్నారంటూ, తక్కిన పాఠశాలల బోధన మాధ్యమాన్నీ మార్చేయడమే మేలన్నది ఏలినవారి నివేదన! అన్నాదురై మాటల్లో- మాతృభాష కళ్లు అయితే, పరాయిభాష కళ్లజోడు. కళ్లను పొడిచేసుకుని కళ్లజోడు పెట్టుకోవడం ద్వారా ప్రపంచాన్ని ఎలా గెలవగలమో అర్థం కాదు!

‘తెలుగు జాతి మనది-రెండుగ వెలుగుజాతి మనది’ అని కీర్తిగానం చేశారు జ్ఞానపీఠాధిపతి సినారె. ‘తప్పనిసరి తెలుగు బోధన బిల్లు’ను నిరుడు తెలంగాణ చట్టసభ ఆమోదించిన వైనం, అందుకు పూర్తి భిన్నంగా ఏపీలో ఆంగ్ల మాధ్యమానికి అగ్రతాంబూలం గమనిస్తే- ఓ కంట పన్నీరు, మరో కంట కన్నీరే! తెలంగాణ వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర సిలబస్‌తో నడిచే అన్ని పాఠశాలల్లో విధిగా తెలుగు బోధన సాగుతుందన్న కేసీఆర్‌ సర్కారు, ఒకటి నుంచి అయిదుదాకా, ఆరు నుంచి పదో తరగతిదాకా రెండు విభాగాలుగా తెలుగు భాష అమలును లక్షించింది. ఆంగ్ల మాధ్యమంలో చదువుల కోసం ఆశపడే బడుగు బలహీన వర్గాల ఆకాంక్షలు తీర్చేలా ఎనిమిది వందల పైచిలుకు గురుకులాల్ని ఏర్పాటు చేసింది. అందుకు పూర్తి విరుద్ధంగా మొత్తం సర్కారీ చదువులన్నింటినీ ఆంగ్ల మాధ్యమంలోకి మార్చేసిన ఏపీ ప్రభుత్వం- తల్లిదండ్రుల కోరిక మేరకే ఆ నిర్ణయం అనడం సరికాదు. తమ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఉండాలని మేలిమి ఉద్యోగాలు రావాలని తల్లిదండ్రులు కోరుకోవడంలో ఏ మాత్రం తప్పులేదు. వారి ఆందోళనకు సహేతుక పరిష్కారాన్ని, మాతృభాష సముద్ధరణ లక్ష్యాన్ని ఉమ్మడిగా సాధించగలిగేలా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు కసరత్తు చేసి ఉండాల్సింది. మాతృభాషకు ప్రాధాన్యం తగ్గరాదన్న లక్ష్యంతో గ్రూప్‌-1 ప్రధాన పరీక్షల్లో తెలుగులో అర్హత సాధించడాన్ని ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ లోగడ తప్పనిసరి చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలన్నింటిలో తెలుగు మాధ్యమంలో చదివినవారికే సమధిక ప్రాధాన్యం ఇస్తే తల్లిదండ్రుల ఆందోళన ఉపశమనంతోపాటు, మాతృభాషాధ్యయనమూ సజీవ స్రవంతిలా సాగేది. ఆ వైపు చూపు సారించకుండా ఆంగ్ల మాధ్యమాన్ని బలవంతంగా రుద్దడంతో- చదువరులతోపాటు బోధకులూ బాధితులయ్యే వాతావరణం సరికొత్త సంక్షోభాన్ని సృష్టించే ప్రమాదం ఉంది!

ప్రజల తలలో నాలుకలా మారడం, రాజపూజ్యం కావడం- ఏ భాషనైనా అజరామరం చేస్తాయి. 1966లోనే అధికార భాషా చట్టం ఆమోదం పొందినా, అధికార భాషా సంఘాలు ఏర్పాటైనా, తలకట్టు భాషకు శాస్త్ర సాంకేతిక పదబంధాల సొబగులద్ది, పాలన భాషగా మెరుగులద్ది తలపాగా చుట్టే చొరవే దశాబ్దాలుగా కొరవడింది. ఆంగ్లభాష వరద తాకిడికి ఎదురొడ్డి మాతృభాషా మమకారంతో తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బంగ వంటివి ఏటికి ఎదురీదుతుంటే, తెలుగు జాతి నాలుకనుంచీ అమ్మ భాష క్రమంగా చేజారిపోయే దుస్థితి దాపురించింది. రష్యా, చైనా, జపాన్‌, జర్మనీ, ఇటలీ తదితర దేశాలన్నీ తమ తమ జాతీయ భాషల్ని కాలానుగుణంగా అభివృద్ధి చేసుకొంటూ సగర్వంగా పురోగమిస్తున్నాయి. జర్మన్‌, స్పానిష్‌ వంటి భాషల్లో ఆంగ్లానికన్నా ఎన్నో రెట్లు అధికంగా సాహితీ సృజనలు, విజ్ఞాన ఆవిష్కరణలు సాగుతున్నాయి. జాతీయ విద్యావిధానం తుది ముసాయిదా మొత్తుకుంటున్నదీ అదే. భారతీయుల్లో కేవలం 15శాతం మాత్రమే ఇంగ్లిషులో మాట్లాడతారంటున్న కస్తూరి రంగన్‌ కమిటీ- ఆర్థిక శిష్ట వర్గ శ్రేణి ఆంగ్లమాధ్యమాన్నే ప్రోత్సహిస్తూ తమ అజమాయిషీలోని ఉద్యోగాలకూ దాన్నే ప్రాతిపదికగా మార్చేసిందని, దాంతో ఉన్నత అవకాశాలు దక్కని మెజారిటీ వర్గం తల్లిదండ్రుల్లో  తమ బిడ్డలు ఆంగ్లభాషలో చదివితేనే బాగుపడతారన్న భావం ప్రబలిందనీ విశ్లేషించింది. ఈ భాషాపర భేషజాలకు సాధ్యమైనంత త్వరగా చెల్లుకొట్టి, మూడో ఏడునుంచే పిల్లలకు మాతృభాషలో జ్ఞానబోధ క్రమపద్ధతిలో సాగే ప్రణాళికను ప్రస్తావించింది. ఈ తరుణంలో, అసలుకే ఎసరొచ్చేలా- తెలుగు మాధ్యమ విద్యార్థి సమూహం బెెదిరిపోయేలా ఆంగ్లమాధ్యమాన్ని సార్వత్రికంగా అమలు చేయబూనడం సరికాదు. తెలుగు గడ్డపై మాతృభాషా బోధనకే కాలం చెల్లడం జాతి దీర్ఘకాల మనుగడనే ప్రశ్నార్థకం చేసే ప్రమాదాన్ని ఉపేక్షించే వీల్లేదు!

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని